అఫ్గానిస్థాన్‌లో ఎక్కడో ఒక చోట నిత్యం ఉగ్రదాడులు జరగుతూనే ఉంటాయి. ఈ దాడుల్లో సామాన్య ప్రజలు బలైపోతుంటారు. అయితే.. ఇటీవల ఉగ్రవాదులు పంథా మార్చారు. దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా దేశ రాజధాని కాబూల్‌లోని సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఇద్దరు మహిళా న్యాయమూర్తులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. సుప్రీంకోర్టుకు కారులో వెళ్తుండగా మహిళా న్యాయమూర్తులపై దాడి చేసి హత్య చేసినట్లు కోర్టు ప్రతినిధులు తెలిపారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు.
రెండు రోజులకే..
రానున్న రెండు దశాబ్దాల్లో అఫ్గాన్‌లో అమెరికా బలగాలను తగ్గిస్తామని అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం. దేశంలో శాంతి నెలకొల్పడం కోసం తాలిబన్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా దాడులు మాత్రం ఆగట్లేదు. గత కొన్ని నెలలుగా రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, న్యాయవాదులు హత్యకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: ఇరాక్‌లో బాంబు దాడి.. ఏడుగురు మృతి