అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మూడోసారి భేటీకానున్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ట్రంప్ ఈ మేరకు ఉభయ కొరియాల సరిహద్దు ప్రాంతంలో కలుస్తున్నట్టు ప్రకటన చేశారు. కిమ్‌కు షేక్ హ్యాండ్ ఇస్తానని తెలిపారు.
"మేము ఉభయ కొరియాల సరిహద్దు ప్రాంతం డీఎమ్జీకి వెళుతున్నాం. అక్కడ కిమ్ జోంగ్ ఉన్ను కలుస్తాను. ఆ భేటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మా మధ్య మంచి సంబంధాన్ని బలపరుచుకున్నాం. ఈ సమావేశం త్వరగానే ముగుస్తుంది. వియాత్నం తరువాత మేము కలవలేదు. అందుకే కేవలం షేక్ హ్యాండ్ ఇచ్చి హలో చెబుతాను. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇది ఒక అడుగు మాత్రమే. సరైన దిశలో వెళుతున్నామని అనుకుంటున్నా."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
డీఎమ్జీ ప్రాంతానికి ట్రంప్‌తో పాటు తానూ వెళుతున్నట్లు చెప్పారు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్. ట్రంప్-కిమ్ భేటీపైనే తన దృష్టి ఉంటుందని తెలిపారు. ఇరువురి మధ్య మరిన్ని సమావేశాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సర్వత్రా ఆసక్తి..
ఉత్తర కొరియా వివాదాస్పద అణు కార్యక్రమాలకు తెరదించడంపై ట్రంప్-కిమ్ గతంలో రెండు సార్లు భేటీ అయినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి. తాజా భేటీ నేపథ్యంలో అణు చర్చల్లో పురోగతిపై మరోమారు ఆశలు చిగురించాయి.
ఇదీ చూడండి: సరిహద్దులో 'కిమ్'కు హాయ్ చెప్తా : ట్రంప్