Tonga Volcano: టోంగా సమీపంలో అగ్నిపర్వతం విస్ఫోటనం బీభత్సం సృష్టించింది. సముద్రం అడుగున ఓ అగ్నిపర్వతం బద్దలవగా.. భారీఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. విస్ఫోటనం చెందిన ప్రాంతానికి 65 కిలోమీటర్ల దూరంలోని టోంగా రాజధాని నుకులోఫాలో.. 1.2 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా.. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.
అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల వెలువడిన వాయువులు, పొగ, బూడిద.. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించాయని.. టోంగా అధికారులు తెలిపారు. ఆ సమయంలో టోంగాకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీలో దాదాపు 8 నిమిషాల పాటు.. పెద్ద ఉరుముల్లాంటి శబ్దాలు వినిపించినట్లు చెప్పారు. టోంగాలోని చర్చిని, అనేక ఇళ్లను అలలు ముంచెత్తాయి.
లక్షా ఐదువేల మంది నివసించే టోంగాలో.. 2014లో సముద్రం అడుగున భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం సంభవించింది. 2015లోనూ అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత విస్ఫోటనం కారణంగా.. టోంగాలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే అంశంపై స్పష్టత లేదని అక్కడి అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: లావా మిగిల్చిన బూడిద కుప్పలు.. అంతులేని ఆవేదన