పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో మంగళవారం సాయంత్రం సంభవించిన భూపంకం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 30కి చేరింది. మహిళలు, చిన్నారుల సహా 370మందికి పైగా గాయపడ్డారు.
పాక్‌లోని లాహోర్, రావల్పిండి, పెషావర్, ఇస్లామాబాద్ నగరాలతో పాటు సియోల్‌కోట్, సర్గోదా, మన్‌సెహ్రా, చిత్రాల్, మాల్‌కండ్, ముల్తాన్, షంగ్లా, బజౌర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉత్తర భారతదేశంలోని దిల్లీ, పంజాబ్, హరియాణాలోనూ భూకంప ప్రభావం స్వల్పంగా కనిపించింది.
పాకిస్థాన్ పంజాబ్‌లోని పర్వత నగరమైన జెహ్లం సమీపంలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని పాక్ వాతావరణశాఖ తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని స్పష్టం చేసింది. అయితే, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైందని పాక్ విజ్ఞాన శాస్త్ర మంత్రి ఫవాద్ చౌదరి పేర్కొనడం గమనార్హం.