'బహుళ భాషల సమాజాల మనుగడ నేడు వాస్తవమైనా, మాతృభాషల పరిరక్షణ తప్పనిసరి అవుతుంది' అని ప్రకటించారు 2012 ఫిబ్రవరి 21న అప్పటి యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరీనా బొకోవా. 'నేను నా అభిమాన భాషలోనే మాట్లాడతాను. ఎందుకంటే నా ఉనికికి నా భాషే కారణం గనక. మా అభిమాన మాతృ భాషనే మా బిడ్డలకు నేర్పుతాం. వారెవరో వారికి తెలియడం అవసరం గనక'- ఇవన్నీ యునెస్కో ఇచ్చిన నినాదాలు. మనిషికి, జంతువులకు ప్రధాన భేదం- సృజనాత్మకత. అందుకు అవకాశం ఇచ్చేది భాష. మానవుడి సృజనాత్మక శక్తికి భాష ఒక వేదిక, ఒక సాధనం. స్వభాషపై తగిన పట్టు లేకపోతే ఆ వ్యక్తికి సృజనాత్మక శక్తి కుంటువడుతుంది. అంతే కాదు- మాతృభాష స్వేచ్ఛను ప్రతిఫలిస్తుంది. అంతరంగాన్ని వెల్లడిస్తుంది. ప్రజాస్వామ్య పునాదిపైనే అది వికసిస్తుంది. మానవ సంస్కృతిలో ఆర్ద్రత అంతరిస్తూ, యాంత్రికత బలపడుతోంది. మనిషికి మనిషితనాన్ని గుర్తుచేసే సాధనాలు భాష, సాహిత్యం, కళలు. ఇవాళ ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య ప్రగతి ప్రవాహంలో సాంస్కృతిక వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాం. నేటి యువతకు ఆ స్పృహే ఉండటం లేదు. రామాయణ, భారతాలు, వాటి చుట్టూ అనేక గాథలు, కథాగానాలు, కావ్యాలు వచ్చి సామాజిక విద్యావిధానాన్ని అక్షరాస్యత లేని రోజుల్లో అఖండంగా కొనసాగించాయి. నేడు ప్రగతి పేరుతో సంస్కృతి పునాదుల్ని విస్మరిస్తున్నాం. ఆ పునాది లేని ప్రగతి వికృతి కారకం. ఈ సాంస్కృతిక పునాదికి మూల ధాతువు మాతృ భాష.
ఆత్మ పరిశీలన అవసరం
'ఒక వ్యక్తికి ఏదైనా విషయాన్ని అతడికి అర్థమయ్యే భాషలో చెబితే ఆ విషయం అతడి తలకెక్కుతుంది. కానీ, అతడి మాతృభాషలో చెబితే అది అతడి హృదయాన్ని చేరుతుంది' అంటారు నెల్సన్ మండేలా. శతాబ్దాల తరబడి విదేశీ పాలనలో ఉన్నా మన సంస్కృతి నాశనం కాకపోవడానికి కారణం సాంస్కృతిక వారసత్వాన్ని మన భాషల మాధ్యమం ద్వారా కాపాడుకుంటుండటమే. ఆంగ్ల భాషకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడమంటే మన జాతి జీవన విధానాన్ని కూకటి వేళ్లతో తుంచివేయడమే. విచిత్రంగా ఇతర భారతీయ భాషా సమాజాల వారితో పోల్చి చూస్తే తెలుగు వారికి తమ తల్లి భాష మీద ఉన్న మమకారం- గుండెల్లో గూడు కట్టిన ఉద్వేగం స్థాయిలో లేదు. భాషా జాతీయవాదంతో తెలుగునాట ఉద్యమాలు జరిగాయి. కానీ, తెలుగు వాళ్ల రక్తంలోకి భాషాభిమానం ఇంకలేదు. భావోద్వేగాల తలపోతగా గాక వాస్తవిక దృక్పథంతో భాష విషయంలో తెలుగు వారు ఆత్మ పరిశీలన చేసుకోవలసిన తరుణమిది.
విద్యారంగంలో భాషల వినియోగం పట్ల ప్రభుత్వాలకు, అధికార పదవుల్లో ఉన్నవారికి సరైన అవగాహన ఉండటం లేదు. విద్యారంగంలో భాషా విధానం శాస్త్రీయంగా ఉండటం లేదు. ఆంగ్ల మాధ్యమం చాలా అవసరమని, వీలున్నంత మందికి బలవంతంగానైనా ఆంగ్లం నేర్పాలని, అప్పుడే పిల్లలు రాణిస్తారనే భావన బలపడుతోంది. పేద పిల్లలు అంతర్జాతీయ అవకాశాలు అందుకోవాలన్నా, ప్రభుత్వ పాఠశాలలు బతికి బట్టకట్టాలన్నా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనే ఏకైక మార్గమనే అభిప్రాయం ఉంది. ఆంగ్ల మాధ్యమాన్ని ఒక సామాజిక అంశంగానూ కొందరు పరిగణిస్తున్నారు. బలహీన వర్గాలకు ఆంగ్ల మాధ్యమం దూరమవుతుందని ఇది సామాజిక దుర్విచక్షణ అని, దళిత వర్గాల పిల్లలు, ఉన్నత విద్యావంతుల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటుండగా, నిమ్న వర్గాల పేదలు, గ్రామీణ ప్రజలు తమ పిల్లల్ని తెలుగు మాధ్యమంలో ఎందుకు చదివించాలనే ప్రశ్న తలెత్తింది. మాతృభాషా పరిరక్షణ బాధ్యత కేవలం పేదవారిదేనా, ఆంగ్లభాష సంపన్న వర్గాల ఆధిపత్య చిహ్నమా... అనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమం సర్వరోగ నివారిణి అనే ఆలోచన దురవగాహన. అన్నం పెట్టని భాష తల్లి భాషైనా వదులుకోవాల్సిందేనంటున్నారు కొందరు. ఇంట్లో మాట్లేడేది తెలుగే గనుక, ఆ భాషలోనే చదువెందుకని ఆలోచించే పెద్దలూ ఉన్నారు. మాతృభాషా వినియోగం వెనకబాటు తనానికి సంకేతమనేది దురదృష్టకర భావన. ఆంగ్లభాష నాగరికతకు, మేధాశక్తికి చిహ్నమనేదీ కూడా తప్పుడు అభిప్రాయమే.
పైన పేర్కొన్న ప్రశ్నలకు, ఆలోచనలకు మాతృభాషాభిమానులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆంగ్లంలో ప్రావీణ్యం కావాలంటే ప్రాథమిక స్థాయిలో ఆ భాషను పిల్లలకు పటిష్ఠంగా నేర్పించాలి. అప్పుడు ఆంగ్లంలో బలమైన పునాది ఏర్పడుతుంది. అంతే తప్ప- ప్రాథమిక పాఠశాల స్థాయిలో విజ్ఞాన, సామాజిక శాస్త్రాలు, గణితం ఆంగ్ల మాధ్యమంలో నేర్పడం వల్ల... పిల్లల పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. నేటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావాలన్నా, మౌఖిక పరీక్షల్లో నిలదొక్కు కోవాలన్నా కేవలం ఆంగ్లం వస్తే చాలనే అభిప్రాయం చాలా తప్పు. విద్యార్థికి తాను చదువుకున్న బోధనాంశాలపై సమగ్రమైన పరిజ్ఞానం అవసరం. ప్రాథమిక దశలో మాతృభాష ద్వారా మెదడులో నిక్షిప్తమైన విషయ పరిజ్ఞానాన్ని ఉన్నత తరగతుల్లో ఆంగ్లంపై పట్టుసాధించాక ఆ భాషలో తేలికగా వ్యక్తం చేయగలుగుతారు. పసిప్రాయంలో శాస్త్ర విషయాలను తనది కాని భాష ద్వారా మెదడులోకి బలవంతంగా పంపించాలనే ఆలోచన అశాస్త్రీయమైనది. అది విద్యారంగ నిపుణులు గాని, అంతర్జాతీయంగా భాషా శాస్త్రజ్ఞులు గాని ఆమోదించని విధానం. ప్రభుత్వాలు పెద్ద పాఠశాలల్లోనూ, పట్టణాల్లోనూ రెండు మాధ్యమాల్లోనూ బోధన సాగించవచ్చు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉపకరించదు సరికదా ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా తన దేశ భాషలో విద్యాబోధనను రద్దుచేయలేదు.
వాస్తవ దృక్పథం కీలకం
మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన మొదటి మూడు దశాబ్దాల్లో అనేక మంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. వారందరూ ఇక్కడ మాతృభాషలో చదువుకున్నవారే. సాఫ్ట్ వేర్ రంగంలో అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లిన తొలితరం సాంకేతిక నిపుణుల్లో చాలామంది తెలుగు వారు తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారే. ఆయా దేశాల్లో తెలుగు సాహిత్యం, సంస్కృతి రంగాల్లో విశేషమైన కృషి సాగిస్తున్న వారే. మరి ఈ నేపథ్యంలో నేటితరం పిల్లలు మాతృభాషా మాధ్యమంలో చదువుకోవడం ప్రయోజనాత్మకం కాదనే ఆలోచన తప్పని గ్రహించాలి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడమే ప్రత్యామ్నాయమనే ఆలోచన సరైనది కాదు. ప్రాథమిక విద్య ప్రైవేటు పాఠశాలల్లోనూ మాతృ భాషా మాధ్యమంలోనే ఉండేలా ప్రభుత్వం చట్టం చేసి పటిష్ఠంగా అమలు జరిపితే- ఆర్థిక, సామాజిక దుర్విచక్షణ లేకుండా అందరికీ ఒకే రకమైన విద్యావిధానం అందుబాటులోకి వస్తుంది. మన సమస్త మనోకార్యకలాపాలు భాష ద్వారానే జరుగుతాయి. ఇంటి భాష, బయట సమాజంలో భాష, బడి భాష- ఇవి వేరయితే జ్ఞాన సముపార్జనపై వ్యతిరేక ఫలితాలు తప్పవు. కన్ను, చెవి, నాలుక లాంటి జ్ఞానేంద్రియాల మధ్య సమన్వయం లేకపోవడం ఎలాంటి లోపమో... ఇదీ అంతే. మాతృభాషా మాధ్యమంలో చదువు కదలుతున్న సమగ్ర దృశ్యం లాంటిదైతే, పరభాషా మాధ్యమంలో రేఖా చిత్రం లాంటిది. ఆంగ్ల భాష బోధన కూడా మాతృ భాష ద్వారా జరిగితేనే విద్యార్థి బాగా నేర్చుకోగలుగుతాడు. ఈ వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వం, విద్యావేత్తలు ఆలోచించినప్పుడు విద్యార్థులు ప్రయోజనం పొందగలుగుతారు. తల్లి భాష మనగలుగుతుంది!
బతుకుదెరువుపై భరోసా
ఏ భాషైనా, ఏ శాస్త్రమైనా బతుకు తెరువుకు పనికొస్తుందనే భరోసా ఉంటేనే ఎవరైనా చదువుతారు. ఒకప్పుడు తమ అభిరుచుల్ని అనుసరించి, ఉత్సాహంతో వివిధ శాస్త్రాలను అధ్యయనం చేసేవారు. ఉపాధి కోసం విస్తృతంగా పోటీ నెలకొన్న వాతావరణంలో ఉపాధి కల్పించే చదువే ఎవరికైనా ప్రాధామ్యం. తిండి పెట్టని చదువు దేనికనే అభిప్రాయం వాస్తవమే. నేడు భాష అవసరాలు అపరిమితం. అన్ని రంగాల్లో, అన్ని అవసరాలకూ శాస్త్ర, సాంకేతిక రంగాలు అన్నిటితో సహా తన భాష తనకు కావాలి. ఈ తరానికి మాతృ భాషమీద అభిమానం లేదని మనం బాధపడుతున్నాం. కానీ, మాతృ భాష జీవికకు ఉపయోగిస్తుందన్న విశ్వాసం కలిగించగలిగితే యువకులు కూడా మాతృ భాషను ప్రేమిస్తారు. ఈ విషయంలో ప్రభుత్వాలకూ బాధ్యత ఉంది. జపాన్, చైనా, కొరియా, కొన్ని ఐరోపా దేశాలు మాతృ భాష వినియోగం వల్ల అభివృద్ధిలో వెనకబడలేదని, ముందున్నాయని రుజువులున్నాయి. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు వారికి మాతృ భాషలే కీలకం. మన ప్రభుత్వాలు నేటి అవసరాలకు తగ్గట్టు ప్రాంతీయ భాషల్ని ఆ భాషా మూలాలపై ఆధారపడి అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉపాధికోసం వెళుతున్నారు? ఆందరూ ఇంజినీరింగ్ చదివి విదేశాలకు వెళ్లడంలేదు. స్థానికంగా ఉపాధి పొందుతున్నవారే ఎక్కువ శాతం. న్యాయవాదులు, వైద్యులు ప్రభుత్వోద్యోగాలు చేస్తూ నిత్యం ప్రజలతో సంబంధాలు నెరపే వారికి మాతృ భాషా వాడకం అనివార్యం. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉన్నతోద్యోగులు ఏ రాష్ట్రంలో పనిచేస్తే అక్కడి ప్రాంతీయ భాష నేర్చుకోవాలనే నిబంధన ఉండేది. ఉపాధి కోసం వలసలు ఉంటున్నా దేశం దాటి, రాష్ట్రం దాటి వెళ్ళేవారి శాతం తక్కువ. మన దేశంలో వలసపోయేవారు ఎక్కువని, అందుకోసం ఆంగ్లం వంటి ఒక ఉమ్మడి భాష అవసరమనే వాదన సహేతుకం కాదు. ఎక్కువ వలసలు పొరుగు రాష్ట్రాలకే పరిమితం అవుతున్నాయి. వలసలు వెళుతున్నవారిలో కూడా అధిక నైపుణ్యం కలిగిన విద్యావంతులు కొంత వరకు ఉన్నా, నైపుణ్యం లేనివారు, ఎంతో కొంత వృత్తి నైపుణ్యం కలిగిన వారే ఎక్కువ. దేశీయ భాషలపై ఆధారపడి లక్షల మందికి జీవనోపాది కల్పిస్తున్న పరిశ్రమలు ఉన్నాయి. సినిమా రంగం కూడా దీనికి మినహయింపు కాదు. వృత్తి వ్యాపారాలను ఆధునికీకరించి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం మాతృ భాష ద్వారానే సాధ్యమవుతుంది. ఇవాళ ఏటీఎంలలో కూడా తెలుగు వాడకానికి అంకురార్పణ జరిగింది. అంతర్జాలంలో అనేక విషయాలు మాతృ భాషలో లభిస్తున్నాయి. సాంకేతికంగా మాతృ భాషా వినియోగాన్ని అభివృద్ధి చేస్తే ఉపాధి కోసం ఆంగ్లం మీద ఆధారపడే పరిస్థితి ఉండదు. నేటికీ స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ శాతం ఉన్నత విద్యావంతులనుంచి గాక సాధారణ విద్యావంతుల కృషివల్లనే లభిస్తోందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో మాతృ భాషా మాధ్యమం జీవితంలో ఉపయోగపడుతుందనే భరోసా కలిగించాలి. ప్రభుత్వం, మేధావులు, వివిధ రంగాల నిపుణులు ఈ దిశలో ఆలోచించాలి.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు