'ప్రమాదకరమైన చైనీయుల ఆహారపు అలవాట్ల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్నాళ్ల కిందట అంతర్జాతీయ వేదికలపై మండిపడ్డారు. మరోపక్క ఆన్‌లైన్‌లో 'గబ్బిలం సూప్' వీడియో ఒకటి హల్‌చల్ చేసి వారి పరువును మరింత పాతాళానికి తొక్కేసింది. వాస్తవానికి ఇది చైనాలో తీసింది కాదు.. అయినా కానీ, చైనా మార్కెట్ల గురించి తెలిసిన ప్రపంచం అక్కడిదే అని నమ్మింది.. అంత చెడ్డ పేరును డ్రాగన్ అప్పటికే మూటకట్టుకొంది.
ఇక కరోనా వైరస్ మహమ్మారిగా మారి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడానికి చైనాలోని వూహాన్ నగరంలో ఉన్న లైవ్ బుష్ మార్కెట్ కేంద్ర బిందువైంది. ఈ మార్కెట్ వీడియోలను చూశాక చాలా మంది కక్కుకున్నంత పనిచేశారు. అవేం రుచులు.. అదేం ఆహారం అని బిత్తరపోయారు.
గబ్బిలాలు చాలా రకాల వైరస్‌లకు ఆవాసాలు..
గతంలో సార్స్ వచ్చినా.. నిఫా వ్యాప్తి చెందినా.. ఆఫ్రికాలో ఎబోలా ప్రబలినా.. వాటికి పరోక్షంగా ఇవే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచం అల్లాడిపోతుంటే.. చైనీయులు మాత్రం తమ ఆహారపు అలావాట్లు మార్చుకోవడంలేదు.
చైనా మార్కెట్లలో నెమళ్లు, కుక్కలు, ఉడుములు, జింకలు వంటి చాలా రకాల వన్యప్రాణులు సజీవంగా కనిపిస్తాయి. వీటిని రకరకాల బోన్లలో పెట్టి కస్టమర్లు ఎంచుకొన్న వాటిని చంపి విక్రయిస్తారు. వుహాన్ మార్కెట్ ఒక్కటే కాదు. వేల సంఖ్యలో చిన్నచిన్న మార్కెట్లు ఉన్నాయి. వీటిని పెంచడానికి పెద్ద పరిశ్రమే ఉంది. కరోనావైరస్ వ్యాప్తికి ముందు ఆ దేశంలో దాదాపు 20,000 ఫామ్‌లు ఉన్నాయి. వైరస్ వ్యాపించాక వీటిని మూసివేయించారు. నెమళ్లు, నక్కలు, జింకలను, తాబేళ్లను పెంచడంలో వీరు నిపుణులు. గతంలో సార్స్ వైరస్ ఇక్కడ విక్రయించిన 'సివిట్' అనే పిల్లి నుంచి మనుషులకు సోకినట్లు గుర్తించారు. అప్పట్లో కొన్నాళ్లు దీనిని నిషేధించారు. ఆ తర్వాత మళ్లీ మామూలే.
జనవరిలో కరోనావైరస్ ప్రబలిన తర్వాత ప్రభుత్వం అక్కడ కొన్ని వన్యప్రాణుల విక్రయాలపై నిషేధం విధించింది. దీంతోపాటు అడవి జంతువులను దిగుమతి చేసుకోడంపై కూడా ఆంక్షలు విధించింది. దీంతో ఈ కామర్స్ సంస్థలు కూడా 1,40,000జంతు ఉత్పత్తులను పోర్టళ్ల నుంచి తొలగించాయి. 17వేల ఖాతాలను స్తంభింప చేసినట్లు చైనా స్టేట్ కౌన్సిల్ వెల్లడించింది. ఆర్డర్లను డెలివరీ చేసే సంస్థలను కూడా హెచ్చరించాయి. ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ కొవిడ్‌తో అల్లకల్లోలం అవుతున్నా.. ఇప్పటికీ అక్కడ ఆన్‌లైన్‌లో వన్యజీవుల విక్రయాలు పెరిగినట్లు చాలా వార్తసంస్థలు పేర్కొంటున్నాయి.
అలుగు నుంచే కరోనా..
2017నాటికి అక్కడ వీటి మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్లు. 1.4కోట్ల మంది ఈ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో చైనా వీటిపై సురక్షితమనే స్టాంప్ వేసి మరీ విక్రయిస్తామని పేర్కొంది. కానీ, ఇది కూడా అమలు కాలేదు. దీనికి తోడు చైనా సంప్రదాయ వైద్యంలో కూడా అడవిజంతువుల వినియోగం చాలా ఎక్కువ. ఇక వూహాన్ మార్కెట్‌నే తీసుకొంటే ఇక్కడ దాదాపు 1,000 దుకాణాలు ఉన్నాయి. వీటిల్లో 120 రకాల జంతువులను విక్రయిస్తున్నారు. ఇక్కడ విక్రయించిన ఒక అలుగు అనే ప్రాణి నుంచే కరోనావైరస్ ప్రపంచాన్ని కబళించడానికి బయల్దేరిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా అలుగులను విక్రయించే మార్కెట్ చైనాలో ఉంది.
జనవరిలో అమల్లోకి వచ్చిన నిషేధానికి మద్దతిచ్చేలా బలమైన నిబంధనలు ఏమీ లేవని వన్యప్రాణి ఉద్యమకారుడు జూ జెన్‌ఫెంగ్ వెల్లడించారు. మరోపక్క ఆన్‌లైన్ మార్కెటింగ్ నిఘా పెట్టడం చాలా కష్టమని ఆయన అంటున్నారు. ఆన్‌లైన్ సంస్థలను భాధ్యులను చేస్తేగానీ ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. దీంతోపాటు వన్యప్రాణులను వేటాడే పరికారాలు, పిట్టలను పట్టుకొనే వలలు, ఉచ్చులు వంటి వాటిని విక్రయించకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చైనాలో వన్యప్రాణుల మాంసాన్ని తినేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
అసలు చిక్కంతా ఇక్కడే..
చైనాలో వన్యప్రాణుల వినియోగంపై పూర్తి నిషేధం విధించడానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది. ఆ దేశం అధికారికంగానే సంప్రదాయ వైద్యాన్ని వ్యాప్తిలోకి తెస్తోంది. ఈ వైద్యంలో వన్యప్రాణుల రక్తం, మర్మాంగాలను కూడా వినియోగిస్తుంటారు. ఈ రకమైన వైద్యానికి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మద్దతు ఉంది. ఈ పరిశ్రమ విలువ సుమారు 130 బిలియన్ డాలర్లు. 'సంప్రదాయ వైద్యశాస్త్రం చైనాకు ఖజానా వంటిది' అని అధ్యక్షుడు షీజిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. 1989లో చైనా వన్యసంరక్షణ చట్టంలోనే జంతువులు మనుషుల ప్రయోజనానికి ఉపయోగపడే వనరులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత 2016లో చేసిన సవరణలో దీనికి మరింత చట్టబద్దత తీసుకొచ్చారు.
వారి సంప్రదాయాలే..
చైనా సంప్రదాయాలు కొంపముంచుతున్నాయి. ఈ విధానంలో జంతువుల పచ్చిమాంసం తినడం, జంతువుల స్రావాలను వాడటం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే యవ్వనంతో ఆరోగ్యంగా ఉంటారని వీరి నమ్మకం. తాజాగా కరోనావైరస్ (కొవిడ్-19) ప్రబలి ఆ దేశంలో 80వేల మందికిపైగా ఆసుపత్రి పాలై.. మూడువేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయినా వారి తీరులో మార్పులేదు. చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలోని హెల్త్ కమిషన్ కొవిడ్‌పై పోరాడే ఔషధాల జాబితాలో టాన్ రీ క్వింగ్ అనే ఇంజక్షన్ పేరును కూడా పేర్కొంది. దీనిలో ఆసియా నల్ల ఎలుగుబంటిలో నుంచి తీసిన బైలీ అనే పదార్థం వాడతారు. ఈ జాబితాను మార్చి4వ తేదీనే ప్రచురించినట్లు నేషనల్ జాగ్రాఫిక్ ఛానల్ వెబ్‌సైట్ పేర్కొంది.
నైజిరీయాలో ఇంకా ఆగని 'అలుగు' విక్రయాలు..
ఒక పక్క ప్రపంచం కరోనా వైరస్ వచ్చి అల్లాడుతున్నా.. ఆఫ్రికాలోని నైజిరీయాలో అలుగు మాంసం విక్రయాలు ఆగడంలేదు. చైనాలో దీని మాంసం వల్లే కరోనావైరస్ ప్రబలిందని భావిస్తున్నారు. దీంతో చైనా వీటిని తాత్కాలికంగా మూసివేసినా.. ఆఫ్రికా దేశమైన నైజీరియాలో మాత్రం వీటి విక్రయాలు ఆగలేదు. చైనాను చూసైనా వీటిని మూసేయించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ దేశంలో కూడా అడవి ఎలుకల నుంచి దుప్పుల వరకూ వివిధ రకాల జంతువులను విక్రయిస్తున్నారు.
ఇదీ చూడండి: దత్తత తీసుకున్నారు.. హోటల్లోనే చిక్కుకుపోయారు!