కరోనాలో కొత్త రకం వైరస్ రోజురోజుకీ కోరలు చాస్తోంది. చైనాలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఇప్పటికే 41కి చేరింది. 30 ప్రావిన్సుల్లో కరోనా బారిన పడ్డవారు 1300 మందికి పైగా ఉన్నట్లు అధికారికంగా తేలింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చైనాలో 13 నగరాలను అష్టదిగ్బంధం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ మొత్తాన్ని స్తంభింపజేసినందున ఈ నగరాల్లో నివసిస్తున్న నాలుగు కోట్ల మంది ప్రజల రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. షాంఘైలో ప్రజారోగ్య భద్రత హెచ్చరికని ఒకటో నంబరు స్థాయికి పెంచారు.
మూగబోయిన నూతన ఏడాది
వరాహ సంవత్సరం వెళ్లిపోయి మూషిక ఏడాది శనివారం నుంచి మొదలవుతున్నా ఎక్కడా నూతన సంవత్సర వేడుకల సందడే కనిపించలేదు. చైనాలో ఇది అతిపెద్ద పండుగ. ఎక్కువ మంది ప్రజలు ఒకేచోట గుమిగూడకుండా ఆంక్షలు విధించారు. వుహాన్ (హుబెయ్ ప్రావిన్సు)లో వ్యాధి తీవ్రత దృష్ట్యా ట్రావెల్ ఏజెన్సీల కార్యకలాపాలను నిలిపివేశారు. నూతన సెమిస్టర్ తరగతులను వాయిదా వేశారు. ఈ ఒక్క ప్రావిన్సులో వ్యాధి విస్తరణకు కళ్లెం వేయడానికి 100 కోట్ల యువాన్ల (సుమారు రూ.1008 కోట్లు) నిధుల్ని కేటాయించడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. రోగులకు చికిత్స అందించడానికి సైన్యంలోని వైద్యాధికారుల్ని రంగంలో దించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు షాంఘైలోని డిస్నీల్యాండ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
గణతంత్ర వేడుకలు రద్దు
ఈ నెల 26న చైనాలోని భారత రాయబారి కార్యాలయంలో జరగాల్సిన భారత గణతంత్ర వేడుకల్ని రద్దు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొత్తరకం కరోనా వైరస్ సోకిన రెండో రోగిని అమెరికా గుర్తించింది. షికాగోలో 60 ఏళ్లు పైబడిన మహిళకు ఈ వైరస్ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నేపాల్‌లో ఒకరికి కూడా వైరస్ సోకినట్లు తేలింది.
10 రోజుల్లోనే 1000 పడకలతో కొత్త ఆస్పత్రి
వుహాన్ నగరంలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా కేవలం చికిత్సకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో 10 రోజుల్లో అక్కడ కొత్త ఆస్పత్రి నిర్మించడానికి చైనా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 3 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. డజన్లకొద్దీ ఎక్స్‌కవేటర్లు, ట్రక్కులు రంగంలో దిగి చకచకా పనులు చేస్తున్నాయి. ముందే తయారుచేసుకున్న నిర్మాణాలతో 25 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వెయ్యి పడకల సామర్థ్యంతో ఆస్పత్రి సిద్ధం కానుంది.
దిల్లీ, ముంబయిల్లో ప్రత్యేక వార్డులు..
కరోనా వైరస్ మోగిస్తున్న మరణ మృదంగం నేపథ్యంలో దిల్లీ, ముంబయిల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. చైనా నుంచి వచ్చినవారిలో ఏ కొద్దిపాటి లక్షణాలు కనిపించినా వారిని ఈ వార్డులకు పంపాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేరళలో ఏడుగురిని, ముంబయిలో ఇద్దరిని, హైదరాబాద్‌లో ఒకరిని పరిశీలన నిమిత్తం ఆస్పత్రుల్లో చేర్పించారు. వారెవరికీ వైరస్ సోకలేదని తేల్చారు.
కేరళలో మరో 73 మందిని వారి ఇళ్లలోనే ఉంచినా వైద్యపరమైన నిఘా విధించారు. దేశంలో ఇంతవరకు ఎవరిలోనూ వైరస్ బయటపడలేదని అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 24 వరకు చైనాకు వెళ్లేవారు, అక్కడి నుంచి వచ్చేవారు తమ టికెట్లను రద్దు చేసుకున్నా, ప్రయాణ తేదీ మార్చుకున్నా దానికి ఎలాంటి అదనపు రుసుములు విధించకూడదని ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు నిర్ణయించాయి.
ఫ్రాన్స్ వరకు పాకిన వైరస్
యూరప్ ఖండంలోనూ కరోనా వైరస్ కాలు మోపింది. ఫ్రాన్స్‌లో తాజాగా రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ చైనాను సందర్శించి వచ్చారని వెల్లడించారు. ఇంకా చాలా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: వణికిస్తోన్న కరోనా.. 17కు చేరిన మృతులు