వినియోగదారులను మోసం చేసినందుకు సీఫుడ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఇద్దరు యజమానులకు 1446 ఏళ్ల జైలు శిక్ష విధించింది థాయిలాండ్ న్యాయస్థానం. తమకు వోచర్లను విక్రయించి మోసం చేశారని రెస్టారెంట్ యజమానులపై వందలాది మంది ఫిర్యాదు చేశారు.
వోచర్ల మోసం...
బ్యాంకాక్‌లోని ఓ సీఫుడ్ రెస్టారెంట్.. కస్టమర్ల కోసం గతేడాది ఫుడ్ వోచర్లతో ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు ముందుగా డబ్బు చెల్లించి వీటిని కొనుగోలు చేయాలి. ధర తక్కువ ఉన్నందున్న కస్టమర్లు ఆసక్తి చూపారు. 20 వేల మంది కస్టమర్లు 1.6 మిలియన్ డాలర్లు విలువ చేసే కూపన్లను కొనుగోలు చేశారు. సాధరణంగా ఉండే రేట్ల కంటే చౌకగా ధరలు ఉండటమే ఇందుకు కారణం.
వోచర్లు కొన్న వారికి మెదట్లో అడ్వాన్స్ బుకింగ్ పద్ధతిలో రెస్టారెంట్ సేవలు అందించింది. అయితే బుకింగ్ ఖరారు కావడానికి కొన్ని నెలలు పట్టేది. ఆ తర్వాత మార్చిలో రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది యాజమాన్యం. డిమాండ్‌కు తగ్గ సీఫుడ్ దొరకడం లేదని చేతులెత్తేసింది . వోచర్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు డబ్బులు తిరిగి చెల్లిస్తామంది.
రెస్టారెంట్ తమను మోసం చేసిందని 818 మంది కస్టమర్లు కోర్టులో ఫిర్యాదు చేశారు. డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. వారిలో 375 మందికి మాత్రమే రీఫండ్ చేసింది రెస్టారెంట్.
ఈ కేసు విచారణ జరిపిన అనంతరం లేమ్గేట్ ఇన్ఫినైట్ రెస్టారెంట్ యజమానులు అపిఛార్ట్ బోవార్న్బంచరక్, ప్రాపసోర్న్ బోవర్న్బంచలకు చేరో 1446 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తప్పు అంగీకరించి శిక్ష తగ్గించాలని కోర్టును ప్రాధేయపడగా జైలు శిక్షను 723 ఏళ్లు తగ్గించింది.
2017లో ఓ కేసులో దోషికి ఏకంగా 13,000 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది థాయ్‌లాండ్ న్యాయస్థానం