తీవ్రవాదాన్ని అణచివేయాలని పునరుద్ఘాటింటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్ ఒసాకాలో జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా బ్రిక్స్ దేశాధినేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తీవ్రవాదంపై పోరుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.
"ఉగ్రవాదమే మానవాళికి పెనుముప్పు. అమాయక ప్రజలను చంపటమే కాకుండా.. ప్రపంచ ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఉగ్రవాదం, జాత్యహంకారానికి మద్దతు ఇచ్చే అన్ని దారులను మూసివేయాల్సిన అవసరం ఉంది."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీవోను బలోపేతం చేయాలన్నారు మోదీ. ఇంధన భద్రత, ఉగ్రవాదంపై పోరాటానికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
మూడు ప్రధాన సవాళ్లు..
ప్రపంచం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లపై దృష్టి పెట్టినట్లు తెలిపారు మోదీ. మొదటిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత, పతనమని పేర్కొన్నారు. రెండోది అభివృద్ధిలో స్థిరత్వాన్ని తీసుకురావాలన్నారు. మూడోది వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, డిజిటలిజమ్, వాతావరణ మార్పులు ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు సవాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు.
బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన జైర్ బోల్సోనారోకు అభినందనలు తెలిపారు మోదీ. బ్రిక్స్ కుటుంబంలోకి స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా అధ్యక్షులు జైర్ బోల్సోనారో, వ్లాదిమిర్ పుతిన్, షి జిన్పింగ్, సిరిల్ రామఫోసా సహా భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జపాన్లో 14వ జీ20 సదస్సు ప్రారంభం