తాలిబన్లు అఫ్గాన్(Taliban news)ను ఆక్రమించేసుకున్నారు. అమెరికా తన సైనిక దళాలను ఉపసంహరించుకునేందుకు నిశ్చయించుకున్న తేదీకి రెండు వారాల ముందే.. దేశాన్నంతటినీ తమ అధీనంలోకి తీసుకున్నారు. అన్ని ప్రధాన నగరాలను క్రమక్రమంగా చేజిక్కించుకొని.. చివరకు రాజధాని కాబుల్‌లోకి ప్రవేశించారు. అమెరికా శిక్షణ తీసుకున్న అఫ్గాన్ సైన్యం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.
అసలు తాలిబన్లు దేశాన్ని ఎందుకు ఆక్రమించుకున్నారు? అఫ్గాన్ దళాలు(Afghan forces) ఎందుకు ప్రతిఘటించలేకపోయాయి? తర్వాత జరిగేదేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు సాధారణ ప్రజలను తొలిచేస్తున్నాయి.
ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఓ పరిశీలిస్తే..
1990 చివరివరకు దేశాన్ని పాలించిన తాలిబన్ ముష్కర ముఠా మరోసారి దేశాన్ని తన అధీనంలోకి(Taliban captures Afghanistan) తీసుకుంది. అమెరికా-నాటో దళాలు దేశం నుంచి వైదొలిగిన తర్వాత కీలక నగరాలపై విరుచుకుపడి ఆక్రమించుకుంది. భయాందోళనకు గురైన ప్రజలు ఎయిర్‌పోర్ట్‌లు, సరిహద్దులకు పరుగులు పెడుతున్నారు. దేశాన్ని విడిచి బయటకు వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నారు.
ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరమేంటి?
తాలిబన్ల పాలన(Taliban rule)లో దేశం అల్లకల్లోలంగా మారిపోతుందని అఫ్గాన్ పౌరులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి మద్దతిచ్చినవారిపై తాలిబన్లు ప్రతీకార దాడులకు దిగుతారని అనుమానిస్తున్నారు. ఆటవికంగా ఉండే ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తారని భయపడుతున్నారు. మహిళలపై ఆంక్షలు, బుర్ఖా ధరించడం తప్పనిసరి, వంటి నిబంధనలను తాలిబన్లు గతంలో అమలు చేశారు. సంగీతాన్ని నిషేధించారు.
అయితే, ప్రస్తుతం ఉన్న తాలిబన్లు ప్రతీకార దాడులు చేయమని చెబుతున్నారు. తమది ఆధునికతతో కూడిన దళం అని చెబుతున్నారు. అయితే, వీరు తమ మాట నిలబెట్టుకుంటారో లేదోనని పౌరులు అనుమానిస్తున్నారు.
అఫ్గాన్ భద్రతా దళాలు ఎందుకు అంత త్వరగా చేతులెత్తేశాయి?
ఒక్కమాటలో చెప్పాలంటే.. అవినీతి! అమెరికా సహా నాటో సభ్య దేశాలు గడిచిన 20 ఏళ్లలో బిలియన్ డాలర్లను అఫ్గాన్ దళాల కోసం ఖర్చు చేశాయి. అయితే, దేశంలోని ప్రభుత్వం మాత్రం అవినీతిలో కూరుకుపోయింది. ఆర్మీ కమాండర్లు సైనికుల సంఖ్యపై తప్పుడు లెక్కలు చెప్పి.. నిధులను మింగేసేవారు. బరిలో ఉన్న సైన్యానికి కూడా సరైన ఆయుధాలు ఉండేవి కావు. కొన్నిసార్లు ఆహారం దొరకని పరిస్థితులు కూడా ఉండేవి.
ఇక, అమెరికా సేనలు దేశం నుంచి వెళ్లిపోవడం వల్ల అఫ్గాన్ సైన్యం నైతిక స్థైర్యం దెబ్బతింది. తాలిబన్లు మెరుపు వేగంతో దాడులు చేయడం వల్ల.. అసలు పోరాటం లేకుండానే యుద్ధం ముగిసింది.
అఫ్గాన్ అధ్యక్షుడికి ఏమైంది?
అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ(Afghan president Ashraf Ghani) దేశం విడిచి వెళ్లిపోయారు. మరింత రక్తపాతం సృష్టించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఏ దేశానికి వెళ్లారనే విషయంపై స్పష్టత లేదు. కజకిస్థాన్‌కు వెళ్లారని తొలుత వార్తలు రాగా.. అక్కడ ఆయనకు అనుమతులు నిరాకరించడం వల్ల ఒమన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
అఫ్గానిస్థాన్ భవిష్యత్(Future of Afghanistan) ఎలా ఉండనుంది?
ప్రస్తుతానికైతే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. అందరినీ కలుపుకొని సంఘటిత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు చెబుతున్నారు. సీనియర్ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో క్రియాశీలంగా ఉన్న నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తామని తెగేసి చెప్పారు. అయితే, సాధారణ పరిస్థితులు నెలకొనేలా వాతావారణాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు.
అఫ్గాన్ ప్రజలు మాత్రం.. తాలిబన్లు హింసాత్మక, అణచివేత ధోరణి అవలంబిస్తారని చెబుతున్నారు. దేశానికి ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్‌గా పేరు మార్చుతామని చెప్పడమూ ప్రజల భయానికి కారణం. గతంలో తాలిబన్లు పాలించిన సమయంలో అఫ్గాన్‌ను ఇలాగే పిలిచేవారు.
తాలిబన్ రాజ్యంలో మహిళల పరిస్థితి?
మహిళల హక్కులకు ప్రాధాన్యం ఉండదని అనేక మంది భయపడుతున్నారు. తాలిబన్లు అధికారం కోల్పోయిన తర్వాత గణనీయంగా పురోగతి సాధించిన మహిళలు.. మరోసారి ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో బాలికలు చదువుకోవడాన్నీ వ్యతిరేకించిన ముష్కరులు.. ప్రస్తుతం దీనికి సానుకూలంగానే ఉన్నారు. కానీ, మహిళల పట్ల అవలంబించే తీరుపై ఎలాంటి స్పష్టమైన విధానాలేవీ రూపొందించుకోలేదు.
చివరగా, ముఖ్యమైన ప్రశ్న... తాలిబన్ల పాలనలో అల్‌ఖైదా(Al Qaeda Afghanistan) మళ్లీ పుంజుకుంటుందా? ఉగ్ర సంస్థల పరిస్థితి ఏంటి?
దీనికి సమాధానం అందరికీ తెలిసిందే!
అయితే, ఉగ్రవాదంపై పోరాడతామని అమెరికాతో కుదిరిన శాంతి ఒప్పందం(US Taliban peace deal)లో తాలిబన్లు పేర్కొన్నారు. విదేశాలపై దాడులు చేసే ఉగ్రసంస్థలకు తమ దేశంలో స్థానం కల్పించబోమని హామీ ఇచ్చారు. కానీ ఈ ఒప్పందం ఎంతవరకు అమలవుతుందనేది ప్రశ్న.
గత 20 ఏళ్లలో పరిస్థితులు బాగా మారిపోయాయి. సాంకేతికంగా అమెరికా మరింత ముందుకెళ్లింది. అనుమానిత ఉగ్రవాదులను యెమెన్, సోమాలియా వంటి దేశాల్లో అగ్రరాజ్యం మట్టుబెడుతోంది. ఇక, 2001 సెప్టెంబర్ 11న జరిగిన ట్విన్ టవర్స్ దాడుల(9/11 attack)కు తాలిబన్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే తలెత్తే పరిణామాలేంటో వారికి బాగా తెలుసు. కాబట్టి, అమెరికాపై దాడి చేయాలనే ఆలోచన పెట్టుకోకపోవచ్చు.
కానీ, అఫ్గాన్‌లో అల్‌ఖైదా తిరిగి పుంజుకుంటుందని ఈ ఏడాది ప్రారంభంలో.. పెంటగాన్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. తాలిబన్లు అధికారంలోకి రాగానే మరింత వేగంగా ఇలాంటి ఉగ్రసంస్థలు బలపడతాయని అన్నారు.
సంబంధిత కథనాలు: