అఫ్గానిస్థాన్‌ను తమ హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Taliban crisis in Afghanistan) భారత్ నుంచి అన్ని రకాల దిగుమతులు, ఎగుమతులను నిలిపివేశారు. పాకిస్థాన్ మార్గాల ద్వారా వచ్చే కార్గో సేవలను పూర్తిగా ఆపేశారని ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ సహాయ్ తెలిపారు.
" అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. పాకిస్థాన్ మార్గాల గుండా దిగుమతులు వస్తాయి. ప్రస్తుతానికి పాకిస్థాన్‌కు కార్గో సేవలను తాలిబన్లు నిలిపేశారు. దాంతో మన దిగుమతులు నిలిచిపోయాయి. అఫ్గాన్‌తో అతిపెద్ద భాగస్వామిగా భారత్ నిలిచింది. 2021లో అఫ్గాన్‌కు మన ఎగుమతులు 835 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మనం 510 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నాం. వాణిజ్యంతో పాటు అఫ్గాన్‌లోని 400 ప్రాజెక్టుల్లో భారత్ సుమారు 3 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. అంతర్జాతీయంగా ఉత్తర, దక్షిణ మార్గాల్లో వస్తువుల ఎగుమతులు సజావుగా సాగుతున్నాయి. అలాగే.. దుబాయ్ మార్గంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతానికి పరిస్థితులు గందరగోళంగా మారినప్పటికీ.. త్వరలోనే సద్దుమణిగి అఫ్గాన్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయనే నమ్మకం ఉంది."
-డాక్టర్ అజయ్ సహాయ్, ఎఫ్ఐఈఓ డీజీ
అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులతో కొద్ది రోజుల్లో దేశంలో డ్రై ఫ్రూట్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఎఫ్ఐఈఓ ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు సహాయ్. అఫ్గాన్ నుంచి భారత్ (Afghan India relations) సమారు 85 శాతం మేర డ్రై ఫ్రూట్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతానికి ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని, కానీ, కొద్ది రోజుల పాటు దిగుమతులు నిలిచిపోతే.. ఊహాగానాలు నిజం అయ్యేందుకు అవకాశం లేకపోలేదన్నారు.
భారత పౌరుల భద్రతే ప్రాధాన్యం..
అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గాన్‌లో నివసిస్తున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చే అంశంపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చించేందుకు సోమవారమే న్యూయార్క్ వెళ్లిన ఆయన.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అఫ్గాన్‌లో ఇక ముందు కూడా భారత్ పెట్టుబడులు కొనసాగిస్తుందా అనే ప్రశ్నపై స్పందించిన మంత్రి.. అఫ్గాన్ ప్రజలతో తమ చారిత్రక సంబంధాలు ఎప్పటికీ కొనసాగిస్తామని తెలిపారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గాన్‌లోని భారత పౌరుల భద్రత తమకు ప్రాధాన్యమని స్వష్టం చేశారు.
అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని ఇప్పటికే స్వదేశానికి తీసుకొచ్చారు.
ఇదీ చూడండి: తాలిబన్ల రాజ్యంతో భారత్‌కు ముప్పు తప్పదా..?