అఫ్గానిస్థాన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హకానీ.. నూతన విద్యా విధానాన్ని (Taliban education policy) ప్రకటించారు. మహిళలు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవచ్చని (Afghan women education) స్పష్టం చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనూ విద్యనభ్యసించవచ్చని చెప్పారు. అయితే, వీరికి బోధించే క్లాస్ రూంలు పురుషులతో కలిపి కాకుండా ప్రత్యేకంగా ఉండాలని తెలిపారు.
యూనివర్సిటీలకు వెళ్లే మహిళా విద్యార్థులు హిజాబ్ తప్పక ధరించాలని హకానీ స్పష్టం చేశారు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం దుస్తులు ఉండాలని చెప్పారు.
"తాలిబన్లు కాలాన్ని 20 ఏళ్లు వెనక్కు తిప్పాలని అనుకోవడం లేదు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే కొనసాగుతాం" అని హకానీ చెప్పుకొచ్చారు.
పాఠ్యాంశాల సమీక్ష
కో-ఎడ్యుకేషన్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేశారు హకానీ. బాలికలు, బాలురు కలిసి చదువుకోవడం కుదరదని తేల్చిచెప్పారు. యూనివర్సిటీల్లో చెప్పే పాఠ్యాంశాలను సైతం సమీక్షిస్తామని అన్నారు. దీనిపై ఇంకా వివరాలు వెల్లడించలేదు.
మారిపోయాం అని తాలిబన్లు చెబుతున్న వేళ.. వారి పాలన ఎలా ఉంటుందోనని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విద్యా విధానాన్ని ప్రకటించారు హకానీ.
1990లలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కఠినమైన నిబంధనలు (Afghan taliban rules) అమలు చేసింది తాలిబన్ సర్కార్. మహిళలకు విద్యను దూరం చేసింది. సంగీతం, చిత్రలేఖనం వంటి కళలపైనా నిషేధం (Taliban music ban) విధించింది.
ఇదీ చదవండి: Taliban news: 'మహిళలు పిల్లల్ని కనాలి కానీ.. పదవులు అడగకూడదు'!