Taliban in Afghanistan: అఫ్గానిస్థాన్లో అధికారం చేపట్టిన తాలిబన్లు.. ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికల చదువుకు కూడా అనుమతిస్తున్నట్లు ఇటీవల చెప్పారు. అయితే ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో మాట మార్చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదని.. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అందుకే ఈ నిర్ణయం : మహిళలకు విద్య, ఉద్యోగంపై పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేస్తోంది. తాలిబన్లు ఇందుకు అంగీకరించినా ఇప్పుడు చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇందుకు గ్రామీణ ప్రజలే కారణమని తెలుస్తోంది. తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు అక్కడి గిరిజనులు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమే అని, భవిష్యత్తులో వారిని అనుమతించే అవకాశం ఉందని తాలిబన్ అధికారి ఒకరు చెప్పారు.
ప్రభుత్వంలో విభేదాలు! : తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుంచి సీనియర్ నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. కొందరు కఠిన పాలనకే మొగ్గు చూపుతుంటే.. మరికొందరు మాత్రం సంస్కరణలు చేపట్టడం అవసరమని వాదిస్తున్నారు. ప్రజలపై, ముఖ్యంగా మహిళలపై విధించిన ఆంక్షలను సడలించాలని వారు పట్టుబడుతున్నారు.
ఇదీ చూడండి : మరియుపోల్పై రష్యా ఉక్కుపాదం.. 10 నిమిషాలకోసారి బాంబుల వర్షం