అఫ్గానిస్థాన్ నుంచి తమ సైనిక బలగాల ఉపసంహరణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్న మరుసటిరోజే తాలిబాన్లు కీలక ప్రకటన చేశారు. దాదాపు 85 శాతం భూభాగం తమ నియంత్రణలోనికి వచ్చేసిందని పేర్కొన్నారు. అయితే.. ప్రాంతీయ రాజధానులపై దాడి చేయమని, బలవంతంగా వాటిని స్వాధీనం చేసుకోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం మాస్కోలో ఉన్న తాలిబాన్ల ప్రతినిధుల బృందం.. ఈ మేరకు రష్యాకు, మధ్య ఆసియాలోని పొరుగు దేశాలకు ఎలాంటి హాని తలపెట్టబోమని హామీ ఇచ్చింది.
తాలిబన్ ఉగ్రవాదులతో తలపడలేక ఇప్పటివరకు 1600 మందికిపైగా అఫ్గాన్ సైనికులు పొరుగున ఉన్న తజకిస్థాన్‌కు పారిపోయారు. తజకిస్థాన్ ఇప్పటికే సరిహద్దుల్లోకి దాదాపు 20,000 మంది బలగాలను తరలించింది. రష్యా కూడా తజకిస్థాన్‌లోని తన సైనిక స్థావరాన్ని బలోపేతం చేస్తోంది.
అమెరికా సహా ఇతర మిత్ర దేశాలను.. తమ భూభాగంలోకి అడుగుపెట్టనివ్వమని తాలిబాన్ ప్రతినిధి షహాబుద్దీన్ దెలావర్ చెప్పారు. 85 శాతం అఫ్గాన్ తమ అధీనంలో ఉందని వెల్లడించారు. రాజకీయ పరిణామాలపై.. కటారీ రాజధాని దోహాలో శాంతియుతంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతినిధి మహ్మద్ సోహెల్ షహీన్ తెలిపారు.
రక్తపాతానికి అడ్డుకట్టపడాలి: భారత్
అఫ్గానిస్థాన్‌లో రోజురోజుకూ హింస పెరిగిపోతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి వెంటనే అడ్డుకట్ట పడాలని ఆకాంక్షించింది. మాస్కోలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో కలిసి భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి:రెచ్చిపోతున్న తాలిబన్లు- ప్రాణభయంతో అఫ్గాన్ మహిళలు!