అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు(Afghanistan Taliban).. కఠిన ఆంక్షలు విధిస్తూ తమ మార్క్ పాలనను చూపిస్తున్నారు. ఇప్పటికే.. మహిళలపై పలు ఆంక్షలు విధించిన తాలిబన్లు(taliban women rights), మగవారికి పలు నిబంధనలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే హెల్మాండ్ ప్రావిన్స్‌లో స్టైల్‌గా హెయిర్ కటింగ్, గడ్డం చేయకుండాా(trimming beard and mustache).. బార్బర్లపై నిషేధం విధించారు. ఈ మేరకు తాలబన్లు విడుదల చేసిన లేఖను ప్రస్తావించింది ఫ్రంటైర్ పోస్ట్.
"దక్షిణ అఫ్గానిస్థాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో స్టైల్‌గా కటింగ్ చేసుకోవటం, గడ్డం తీసుకోవటంపై నిషేధం విధించారు. రాష్ట్ర రాజధాని లష్కర్ గాహ్‌లో పురుషుల క్షౌరశాలల ప్రతినిధులతో ఇస్లామిక్ ఒరియంటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశమయ్యారు. షేవింగ్, స్టైలీష్ హెయిర్ కట్కు దూరంగా ఉండాలని సూచించారు. సెలూన్ ఆవరణల్లో పాటలు, శ్లోకాలు వినిపించొద్దని స్పష్టం చేశారు."
- ఫ్రంటైర్ పోస్ట్
తాలిబన్లు విడుదల చేసిన ఈ ఆదేశాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. తాలిబన్లు తాము అధికారంలో ఉన్న 1996-2001 నాటి కఠిన చట్టాలను అమలులోకి తెస్తున్నారు. అఫ్గాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు భారీగా పెరిగిపోయాయని పలు నివేదికలు చెబుతున్నాయి. పలువురిని హతమార్చి.. బహిరంగంగానే క్రేన్లకు వేలాడదీసిన సంఘటనలు రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చాయి.
ఇదీ చూడండి: Afghan Taliban: తాలిబన్ల పాలనలో మీడియాపై ఉక్కుపాదం..