అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది. దేశంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తాలిబన్లు ప్రకటించారు. 20ఏళ్లు పాటు అమెరికా- దాని మిత్రదేశాలపై నిర్విరామంగా పోరాటం చేసిన వారికి ప్రభుత్వంలో పెద్దపీట వేశారు.
ఆపద్ధర్మ ప్రధాని ముల్లా హసన్ అఖుంద్ నేతృత్వంలో పాలన సాగనుంది. 2001లో తాలిబన్ల ప్రభుత్వం కుప్పకూలిన సమయంలోనూ ఈయనే ప్రధానిగా ఉన్నారు. మరోవైపు అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందంపై చర్చలు సాగించిన, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘని బరాదర్‌కు కేబినెట్లో ఉప ప్రధాని బాధ్యతలను అప్పగించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంత కాలం కొనసాగుతుందనే విషయంపై తాలిబన్లు స్పష్టతనివ్వలేదు. ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న ప్రశ్నకూ సమాధానం లేదు.
తాలిబన్ టాప్ లీడర్ ముల్లా హెబతుల్లా అఖుంద్జాదా.. కొత్త ప్రభుత్వం షరియా చట్టానికి కట్టుబడి విధులు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
తాలిబన్యేతర సభ్యులను కేబినెట్లో చేర్చుకోవాలని అంతర్జతీయ సంగం అనేకమార్లు డిమాండ్ చేసింది. కానీ వాటిని తాలిబన్లు చాలా వరకు విస్మరించినట్టు తెలుస్తోంది.
గతవారమే ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు ప్రకటన చేయాల్సి ఉంది. పలు కారణాల వల్ల అది పలు మార్లు వాయిదా పడింది.
అమెరికా దళాలు దేశాన్ని వీడుతున్న క్రమంలో గత నెల 15న మెరుపువేగంతో కాబుల్‌ను తమ వశం చేసుకున్నారు తాలిబన్లు. ఫలితంగా దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి.
1996-2001 మధ్య కాలంలో తాలిబన్ల అరాచక పాలన ఇప్పటికీ ఆ దేశ ప్రజలు మరచిపోలేదు. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయోనని అక్కడి వారు భయపడుతున్నారు.