మయన్మార్ ఎన్నికల్లో తమదే విజయమని అధికార 'నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ' పార్టీ ప్రకటించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పార్లమెంట్ సీట్లను గెలుచుకున్నట్లు తెలిపింది.
"మేము 322 సీట్లకు పైగా గెలుస్తాం. మొత్తం 642 స్థానాలకు గాను 377 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ అంతకన్నా ఎక్కువే సొంతం చేసుకుంటాం."
- మోనీవా ఆంగ్ షిన్, ఎన్ఎల్డీ అధికార ప్రతినిధి
అయితే ఓటింగ్ శాతం, ఫలితాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పూర్తి ఫలితాలు ప్రకటించడానికి ఓ వారం వరకు సమయం పట్టే అవకాశం ఉందని ఈసీ తెలిపింది.
ఎన్ఎల్డీ విజయం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే మైనారిటీ ఆధారిత పార్టీలతో దూరంగా ఉండటం అధికార ఎన్ఎల్డీ గెలిచే స్థానాలపై ప్రభావం చూపించొచ్చని విశ్లేషకులు అంటున్నారు. 2015 ఎన్నికల్లో ఎన్ఎల్డీ ఈ పార్టీలతో పొత్తు పెట్టుకుంది.
సూకీ పైనే..
2015 ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించిన నేత ఆంగ్ సాన్ సూకీపైనే అందరి దృష్టి ఉంది. ఐదేళ్లలో ఆమె పాలనపై మిశ్రమ స్పందన ఉంది. అంచనాలు అందుకోలేని ఆర్థిక వృద్ధి సహా పాలనపై ఏళ్లనాటి సైనిక ప్రభావం వంటివి ఆమెకు ప్రతికూలతలుగా మారాయి.
రోహింగ్యాలు...
దేశంలోని మైనారిటీ ముస్లిం రోహింగ్యాల హక్కులను కాపాడటంలో సూకీ విఫలమయ్యారనే వాదన ఉంది. 2017లో 7,40,000 మంది రోహింగ్యాలు దేశం నుంచి బంగ్లాదేశ్ వలస వేళ్లేలా మయన్మార్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ను ఆమె అడ్డుకోకపోవడం ఇప్పటికీ ఆమె మద్దతుదారులను ఆశ్చర్యపరిచే విషయమే.
రోహింగ్యాలు సహా కొందరికి ఈసారి ఓటు వేసే అవకాశం దక్కకపోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 26 లక్షల మంది మయన్మార్ దేశస్థులు ఈ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నారు. వారిలో 11 లక్షల మంది రోహింగ్యాలే. భద్రతా కారణాల వల్ల వారితో పాటు రఖైన్ రాష్ట్రంలో ఉన్న బౌద్ధులను కూడా ఓటింగ్ ప్రక్రియకు దూరం చేయడం విమర్శలకు తావిచ్చింది.
ఈ ఎన్నికల్లో 90కి పైగా పార్టీలు పోటీపడ్డాయి. 3.7 కోట్ల మంది వరకు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వారిలో 50 లక్షల మంది యువ ఓటర్లే.
2015లో ఆమె నేతృత్వంలోని ఎన్ఎల్డీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఐదు దశాబ్దాలకు పైగా ఉన్న సైనిక పాలనకు తెరదించింది.
- ఇదీ చూడండి: బైడెన్-కమల సర్కార్ తొలి ప్రాధాన్యం వీటికే..