శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలకు మరోసారి తేదీని ఖరారు చేశారు ఆ దేశ ఎన్నికల కమిషన్ ఛైర్మన్ మహింద దేశప్రియ. ఆగస్టు 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మార్చి 2న ఆరునెలలు ముందస్తుగా పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. అయితే దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ రెండుసార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 25న పోలింగ్ జరగాల్సి ఉండగా.. దానిని జూన్ 20కి వాయిదా వేశారు. వైరస్ ఉద్ధృతి తగ్గని కారణంగా తాజాగా ఆగస్టు 5కు పోలింగ్ తేదిని మార్చారు.
అయితే అధికార పార్టీకి మేలు చేకూర్చేందుకే ఎన్నికల కమిషన్ పోలింగ్ తేదీని వాయిదా వేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం శ్రీలంక సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.