- కోడి గుడ్డు రూ.35
- కిలో చికెన్ రూ.1000
- లీటర్ కొబ్బరి నూనె రూ.900
- కిలో పాల పొడి రూ.1945
Sri Lanka Crisis: ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో ప్రస్తుత ధరలివి. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు సుమారు అన్ని నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యులకు అందకుండా కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం శ్రీలంకలో కేజీ చికెన్ ధర రూ.800 నుంచి వెయ్యి వరకు పలుకుతుండగా కోడి గుడ్డు ఒక్కోటి 35 రూపాయలకు విక్రయిస్తున్నారు. అలాగే కిలో ఉల్లిపాయలు రూ.200 నుంచి రూ.250, కేజీ పాల పొడి రూ.1,945., కేజీ గోధుమ పిండి రూ.170 నుంచి రూ.220 మధ్య అమ్ముతున్నారు. లీటర్ కొబ్బరి నూనె ఏకంగా.. 850నుంచి 900 రూపాయల మధ్య పలుకుతోంది.
ప్రస్తుతం డాలర్‌తో శ్రీలంక కరెన్సీ విలువ 270 రూపాయలకు చేరింది. ఫలితంగా నిత్యవసర వస్తువులతో పాటు ఇంధనం, గ్యాస్ ధరలు అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి.
1970 కంటే దారుణంగా..
ప్రస్తుతం శ్రీలంకలో లీటర్ పెట్రోల్ 283 రూపాయలకు చేరగా లీటర్ డీజల్‌ను రూ.220కి విక్రయిస్తున్నారు. అటు వంట గ్యాస్ కొరత కారణంగా.. శ్రీలంకలోని 90శాతం హోటళ్లు మూతపడ్డాయి. 1970లో సంభవించిన కరవు కంటే దారుణమైన పరిస్థితులను ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్నట్లు పెరదేనియా యూనివర్సిటీలో ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్ సంగరన్ విజేసంధిరన్ తెలిపారు. దేశంలో డాలర్ల కొరతను సర్దుబాటు చేసేందుకు శ్రీలంక తీసుకున్న సరళమైన విదేశీ మారక రేటు విధానమే, ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం వల్ల శ్రీలంక ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పెరిగిన ధరలకు.. ప్రభుత్వానిదే బాధ్యతంటూ గత కొన్ని రోజులుగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్సే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న కొలంబొలోని అధ్యక్ష భవంతని.. వందలాది మంది ప్రజలు ముట్టడించగా అది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అటు విపక్షాలు సైతం ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతున్నాయి. ప్రజల్లో పెల్లుబికిన నిరసన సెగలు ప్రభుత్వం గద్దె దించేందుకు నాంది పలికాయని విపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస అన్నారు.
ఇదీ చూడండి : 'ఆహారం, నీళ్లు ఇవ్వండి ప్లీజ్'.. బతిమలాడుతున్నా కరుణించని రష్యా సైన్యం