ఆల్‌ఖైదాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా-అఫ్గాన్ ఉమ్మడి వైమానిక దళాల దాడుల్లో దక్షిణాసియా ఆల్‌ఖైదా శాఖకు చెందిన నాయకుడు అసిమ్ ఉమర్ మరణించినట్లు అఫ్గానిస్థాన్ అధికారులు ధ్రువీకరించారు.
2014 నుంచి భారత ఉపఖండంలో ఆల్‌ఖైదాకు నాయకత్వం వహిస్తున్న అసిమ్ ఉమర్‌ను.. సెప్టెంబర్ 23న అఫ్గానిస్థాన్ దక్షిణ హెల్మండ్ ప్రావిన్స్‌లోని ముసాఖాలా జిల్లాలో హతం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ కరుడుగట్టిన ఉగ్రవాది.. పాకిస్థాన్ పౌరుడని కొన్ని నివేదికలు, భారత్‌లో జన్మించాడని మరికొన్ని ఆధారాలు తెలుపుతున్నట్లు అఫ్గాన్ జాతీయ భద్రతా డైరెక్టరేట్ తెలిపింది.
మరో ఆరుగురు హతం
అసిమ్ ఉమర్‌తో పాటు మరో ఆరగురు ఆల్‌ఖైదా ఉగ్రవాదులు కూడా ఈ దాడిలో మరణించారని అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది పాక్‌కు చెందినవారని పేర్కొన్నారు.
కొరియర్ బాయ్ చచ్చాడు..
హతమైన ఈ ఆరుగురు ఉగ్రవాదుల్లో 'రాయ్హాన్' కూడా ఉన్నాడని తెలుస్తోంది. రాయ్హాన్.. ఆల్‌ఖైదా నాయకుడు అయమాన్ అల్ జవహిరికి కొరియర్ బాయ్‌గా పనిచేశాడు. అయితే రాయ్హాన్ మరణం గురించి స్పందించడానికి యూఎస్- అఫ్గాన్ దళాలు నిరాకరించాయి.
సెప్టెంబర్ 22-23 తేదీల్లో రాత్రిపూట జరిగిన ఈ ఆపరేషన్‌కు యూఎస్ వాయుసేన సహకారం అందించింది.
40 మంది పౌరులు కూడా
అమెరికా- అఫ్గాన్ దళాలు చేసిన ఈ దాడిలో పిల్లలు సహా 40 మంది మరణించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే నివేదికలను పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు.
అలా అయితేనే వైదొలగుతాం..
యూఎస్-తాలిబన్ల మధ్య శాంతి చర్చలు ఆగిపోయాయి. అయితే తిరుగుబాటుదారులు.. ఆల్‌ఖైదాతో ఉన్న అన్ని సంబంధాలు వదులుకోవాలని, అఫ్గానిస్థాన్‌లో భద్రతకు హామీ ఇవ్వాలని అమెరికా స్పష్టం చేసింది. అలా చేస్తేనే అఫ్గానిస్థాన్ నుంచి వైదొలగడానికి అంగీకరిస్తామని తెలిపింది.
ఇదీ చూడండి: భారత్ చెంతకు తొలి 'రఫేల్'.. రాజ్‌నాథ్‌సింగ్ చక్కర్లు