అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Kabul Airport) దేశీయ విమాన సేవలు పునరుద్ధరించారు. అరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్ విమానాలు మూడు రాష్ట్రాలకు వెళ్లినట్టు మేనేజర్ తెలిపారు. ఎయిర్‌పోర్టులో రాడార్ వ్యవస్థ లేకుండానే ఈ విమానాలు పయనించినట్లు వెల్లడించారు. పశ్చిమ హెరాత్, దక్షిణ కాందహార్, ఉత్తర బాల్క్ రాష్ట్రాలకు ఇవి చేరుకున్నట్లు పేర్కొన్నారు.
అఫ్గాన్‌ను తాలిబన్లు తమ వశం చేసుకున్నాక(Afghan Crisis) కాబుల్ విమానాశ్రయంలో సేవలు నిలిచిపోయాయి. కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక సాయం అందించేదుకు గతవారమే కతర్, టర్కీ టెక్నీషియన్లు కాబుల్ వెళ్లారు. అఫ్గాన్‌కు మానవతా సాయం అందించాలంటే కాబుల్ విమానాశ్రయంలో కార్యకలాపాలు పునరుద్ధరించడం అత్యంత కీలకమని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే స్పష్టం చేసింది. తాలిబన్లు(Afghan Taliban) కూడా ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమాన సేవలు త్వరలోనే పునరుద్ధరిస్తామని ఇటీవలే చెప్పారు.
అమెరికా సైన్యాధికారి కృతజ్ఞతలు..
కాబుల్ నుంచి అమెరికన్లను తరిలించేందుకు ప్రాణాలకు తెగించి సాయం చేసిన తమ సైనికులకు యూఎస్ ఆర్మీ జనరల్ మార్క్ మిల్లే కృతజ్ఞతలు తెలిపారు. జర్మనీలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. తమ దేశ 10వ మౌంటెయిన్ డివిజన్ సైనికుల సేవలను కొనియాడారు. కాబుల్ విమానాశ్రయంలో ఓ వైపు బాంబులు పేలుతున్నా అమెరికా సైనికులు మాత్రం యథావిధిగా సేవలు కొనసాగించారని ప్రశంసించారు.
కాబుల్ విమానాశ్రయంలో ఆగస్టు 26న జరిగిన జంటపేలుళ్ల ఘటనలో(Kabul Airport Blast) 180మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 13మంది అమెరికా సైనికులు ఉన్నారు. దీనికి ప్రతీకారంగా ఐసిస్-కే స్థావరాలపై అమెరికా సైన్యం డ్రోన్ దాడులు నిర్వహించింది. అనంతరం ఉద్రిక్త పరిస్థితుల నడుమే తమ బలగాలు, ప్రజలను స్వదేశం తరలించింది.
ఇదీ చదవండి: Taliban Panjshir: తాలిబన్లపై షేర్ 'పంజా'- 600 మంది హతం!