కరోనా వైరస్ టీకాను ప్రజలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది రష్యా. నిజానికి ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ఇదో సంచలన వార్త. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇన్ని రోజులు వ్యాక్సిన్ కోసం ఎదురుచూసిన ప్రపంచ దేశాలు రష్యా ప్రకటనపై సంబరపడకుండా.. వైరస్ సురక్షితమేనా? కాదా? అని ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు కారణమేంటి?
మూడో దశ ముగియకుండానే...
ఆగస్టులో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని గత నెల నుంచే రష్యా స్పష్టంగా చెబుతోంది. దాన్ని నిజం చేస్తూ.. తాము అభివృద్ధి చేసిన టీకాను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించారు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. కానీ రష్యా వ్యాక్సిన్‌పై సొంత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడో దశ ట్రయల్స్ నిర్వహించకుండానే వ్యాక్సిన్‌ను ఎలా విడుదల చేస్తారని రష్యాకు చెందిన శాస్త్రవేత్తలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మూడో దశ పూర్తవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని.. వేల సంఖ్యలో ప్రజలపై పరీక్షలు నిర్వహించాలని చెబుతున్నారు. అలాంటిది.. ట్రయల్స్ పూర్తిగా జరగకుండానే వ్యాక్సిన్‌ను విడుదల చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
వీటన్నిటితో పాటు రష్యా వ్యాక్సిన్‌పై మరో విషయంలోనూ ప్రజల్లో భయాందోళన నెలకొంది. వ్యాక్సిన్‌ను విడుదల చేస్తున్నట్టు పుతిన్ ప్రకటించినప్పటికీ.. ట్రయల్స్‌కు సంబంధించి జరిగిన పరీక్షల ఫలితాలపై ఎలాంటి వివరాలు లేవు. ఎంత మందిపై వ్యాక్సిన్ ట్రయల్స్ జరిపారనేది ఇంకా తెలియదు.
'అంతా బాగానే ఉంది...'
కానీ రష్యా అధ్యక్షుడు ఈ ప్రశ్నలన్నింటినీ తోసిపుచ్చుతూ వ్యాక్సిన్ విడుదలపై ప్రకటన చేశారు. ప్రజలకు టీకా వేసే ముందు చేయాల్సిన పరీక్షలన్నీ ఈ వ్యాక్సిన్‌పై జరిపినట్టు స్పష్టంచేశారు. తన సొంత కుమార్తె.. ఈ వ్యాక్సిన్ తీసుకుని ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు.
"ఈ వ్యాక్సిన్ అన్ని పరీక్షలను పూర్తి చేసుకుంది. వ్యాక్సిన్ ఎంత సురక్షితమైనదనే విషయమే అత్యంత కీలకం. దాని సమర్థత కూడా ముఖ్యమే. నా ఇద్దరు కుమార్తెల్లో ఒకరు ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండు డోసులు ఇచ్చారు. ఆమె ఆరోగ్యంగానే ఉంది. మొదటి డోసు ఇచ్చినప్పుడు 38 డిగ్రీలుగా ఉన్న శరీర ఉష్ణోగ్రత 37కు తగ్గింది. రెండో డోసు సమయంలో ఉష్ణోగ్రత కొంత పెరిగి జ్వరం వచ్చింది. ఆ తర్వాత అంతా మాములుగా మారిపోయింది."
--- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు.
అయితే వ్యాక్సిన్ తీసుకున్న కమార్తె పేరును మాత్రం పుతిన్ బయటపెట్టలేదు.
భారీ స్థాయిలో ఉత్పత్తి
అక్టోబర్ నాటికి వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది రష్యా. పలు దేశాలు ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపిస్తున్నట్టు ప్రధానమంత్రి మిఖైల్ మురాస్కో వెల్లడించారు.
రష్యా వ్యాక్సిన్‌ను గమలేయా రీసర్చ్ ఇన్స్టిట్యూట్, దేశ రక్షణశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ టీకాకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభమయ్యాయి. ఇందులో 38 మంది వలంటీర్లు పాల్గొన్నారు. అందరిలోనూ రోగనిరోధక శక్తి పెరిగింది. వీరు జులై 15, 20వ తేదీల్లో డిశ్చార్జ్ అయ్యారు.
ఇదీ చూడండి:- కరోనా వ్యాక్సిన్ తొలుత అందేదెవ్వరికి?