కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్న చైనా, తాజాగా డోసుల తయారీలోనూ దూసుకెళ్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి దాదాపు 60కోట్ల వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సినోవాక్ వ్యాక్సిన్ సంస్థ పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే 50కోట్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు వెల్లడించింది. తాజా పెట్టుబడులతో వ్యాక్సిన్ అమ్మకాల సామర్థ్యంతోపాటు నూతన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడంలో దోహదపడుతుందని సినోవాక్ ఆశాభావం వ్యక్తం చేసింది.
అనుమతులు పొందలేదు..
చైనాలో ఇప్పటివరకు ఐదు వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉండగా, దాదాపు 12దేశాల్లో వాటి తుదిదశ ప్రయోగాల్లో నిమగ్నమయ్యాయి. సినోవాక్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్ తుదిదశ ప్రయోగాలను మాత్రం బ్రెజిల్, టర్కీ, ఇండోనేషియా దేశాల్లో చేపడుతోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను లక్షల సంఖ్యలో చైనా ఆరోగ్య సిబ్బందితో పాటు సైనిక అధికారులకు అందజేసినట్లు సమాచారం. అత్యవసర వినియోగం కింద చైనాలో భారీ సంఖ్యలో పంపిణీ చేస్తున్నప్పటికీ, అధికారిక అనుమతులు మాత్రం పొందలేదు.
ఈ విషయంపై ఇప్పటికే అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. అయినప్పటికీ లక్ష్యల సంఖ్యలో పంపిణీ చేస్తూనే ఉన్నారు. కంపెనీ తయారు చేసిన మరో 12లక్షల ప్రయోగాత్మక వ్యాక్సిన్ డోసులను ఇండోనేషియాకు పంపించగా.. అత్యవసర వినియోగ అనుమతి కోసం వేచి చూస్తోంది. సినోవాక్ తయారు చేసిన వ్యాక్సిన్ రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉండగా, దీన్ని సాధారణ ఉష్ణోగ్రతల (2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్) వద్దే నిల్వ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
కోలుకున్నవారికంటే తక్కువగానే...
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోన్న సంస్థలు వాటి సమర్థతను వెల్లడిస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ, చైనా కంపెనీలు మాత్రం అక్కడి వ్యాక్సిన్‌లపై కచ్చితమైన సమాచారం విడుదల చేయడం లేదని అభిప్రాయం ఉంది. అయితే, లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక ప్రకారం, సినోవాక్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అవి ఉత్పత్తి చేస్తోన్న యాంటీబాడీలు, కరోనా నుంచి కోలుకున్నవారిలో కంటే తక్కువగానే ఉంటున్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి:టీకా పంపిణీకి చైనా సన్నాహాలు