గురునానక్ 550వ జయంతి సందర్భంగా భారతీయ సిక్కులు పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకున్నారు. పంజాబ్ గవర్నర్ చౌదరి సర్వార్ ఆధ్వర్యంలో అక్కడ బంగారు పల్లకీని ఏర్పాటుచేశారు. నన్‌కనా సాహిబ్‌లో జరిగే గురునానక్ దేవ్ 550 జయంతి వేడుకల్లో పాల్గొనడం కోసం భారత్ నుంచి 1100 మంది సిక్కు భక్తులు తరలి వెళ్లారు. వీరు కర్తార్‌పుర్ సాహిబ్‌గా పిలుచుకునే గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకున్నారు.
నడవాతో సమస్య పరిష్కారం..
కర్తార్‌పుర్ నడవాను గురునానక్ జయంతి సందర్భంగా.. ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించనున్నారు. పాకిస్థాన్‌లోని నన్‌కనా సాహిబ్ గురుద్వారాను పంజాబ్ రాష్ట్రం గురుదాస్‌పుర్‌జిల్లాలోని డేరాబాబా నానక్ గురుద్వారాను కలుపుతూ భారత్-పాక్ ప్రభుత్వాలుకర్తార్‌పుర్ కారిడార్‌ను నిర్మించాయి.
కర్తార్‌పుర్ నడవా ఇరుదేశాలను దగ్గర చేసేందుకు తోడ్పడుతుందని పంజాబ్ గవర్నర్ చౌదరీ సర్వార్ అభిప్రాయపడ్డారు.
ఎన్ఓసీ తప్పనిసరి
కర్తార్‌పుర్ సాహిబ్ దర్శనం విషయంలో.. భారతీయులకు తప్ప మిగతా విదేశీ సిక్కులకు అందరికీ పాక్ అంతర్గత మంత్రిత్వశాఖ జారీ చేసే 'నిరభ్యంతరం పత్రం(నో అబ్జెక్షన్ సర్టిఫికేట్-ఎన్ఓసీ)'ను తప్పనిసరి చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టూర్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.
"అమెరికా, కెనడా, ఐరోపా దేశాల సిక్కులకు లాహోర్ పర్యటన కోసం పర్యటక వీసా జారీ చేశాం. పవిత్ర ప్రదేశాల దర్శనాల విషయంలో కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయి. అందువల్ల టూర్ ఆపరేటర్లు కచ్చితంగా పాక్ అంతర్గత మంత్రిత్వశాఖ జారీచేసే 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్'ను తప్పనిసరి చేయాలని ఆదేశించాం."
- ఓ అధికారి
ఇదీ చూడండి: 'పారిస్' నుంచి వైదొలుగుతూ ఐరాసకు అమెరికా లేఖ