పాకిస్థాన్ ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లింది. దేశ రాజదాని సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఆకస్మిక పరిణామం వల్ల కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ వంటి పెద్ద నగరాలతో పాటు పలు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. విద్యుత్ వ్యవస్థ స్తంభించటానికి గల కారణమేంటని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం, అధికారులపై విమర్శలు చేశారు.
జాతీయా విద్యుత్ సరఫరా వ్యవస్థ(ఎన్టీడీసీ)లో తలెత్తిన లోపం వల్లే ఇలా జరిగిందని ఇస్లామాబాద్ డిప్యూటీ కమిషనర్ హంజ షఫ్కత్ తెలిపారు. విద్యుత్ సరఫరాను తిరిగి పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
"విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడానికి ఫ్రీక్వెన్సీ 50 నుంచి సున్నాకు పడిపోవడమే కారణం. అసలు విద్యుత్ ఫ్రీక్వెన్సీ సున్నాకు పడిపోవడానిక గల కారణమేంటో తెలుసుకునే పనిలో ఉన్నాం. ప్రజలు సంయమనంతో ఉండాలని కోరుతున్నా."
- ఒమర్ అయుబ్, విద్యుత్ శాఖ మంత్రి
తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తామని తెలిపారు మంత్రి. విద్యుత్తు శాఖతో పాటు పలు విభాగాలు సరఫరా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: 'బాలాకోట్ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మరణించారు'