ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. దక్షిణ కొరియాకు క్షమాపణలు చెప్పారు. తమ దేశ ప్రభుత్వ అధికారి హత్య అనుకోకుండా జరిగిందని కిమ్ వివరణ ఇచ్చినట్లు దక్షిణ కొరియా అధ్యక్ష భవనం ప్రకటించింది.
కిమ్ లాంటి నేత శత్రు దేశానికి క్షమాపణలు చెప్పడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇదీ జరిగింది..
దక్షిణ కొరియాకు చెందిన ఒక ప్రభుత్వ అధికారిని ఉత్తర కొరియా కాల్చి చంపింది. ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేసింది. ఈ విషయాన్ని గురువారం దక్షిణ కొరియా ప్రకటించింది. అక్రమ చేపలవేట నిరోధక బృందంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ 48 ఏళ్ల అధికారి సోమవారం ఓడ నుంచి అదృశ్యమయ్యాడని.. మరుసటి రోజు ఓ చిన్నబోటులో ఉత్తర కొరియా జలాల్లోకి వెళ్లాడని, దీన్ని గమనించిన ఉత్తర కొరియా భద్రతా సిబ్బంది అతణ్ని కాల్చి చంపారని తెలిపింది. గ్యాస్ మాస్కులు, పీపీఈ కిట్లు ధరించిన భద్రతా సిబ్బంది ఆ అధికారి మృతదేహాన్ని దహనం చేశారని వెల్లడించింది.
కరోనా వ్యాప్తి కట్టడి పేరిట కఠిన నిబంధనలు అమలు చేస్తోంది ఉత్తర కొరియా. తమ దేశంలోకి అక్రమంగా విదేశీయులెవరైనా ప్రవేశిస్తే కాల్చి చంపేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది కిమ్ సర్కార్.