ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు 4.2 బిలయన్ డాలర్ల సాయం అందించనుంది సౌదీ అరేబియా. పాక్ ప్రధాని ఈ వారం సౌదీలో పర్యటించి ప్రిన్స్ సల్మాన్‌తో చర్చలు జరిపిన మూడు రోజుల అనంతరం ఈ ప్రకటన వచ్చింది. సాయంలో భాగంగా పాకిస్థాన్ కేంద్ర బ్యాంకులో 3 బిలియన్ డాలర్లు డిపాజిట్ చేయనుంది సౌదీ. మరో 1.2 బిలియన్ డాలర్లను ఈ ఏడాది రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులకు ఫైనాన్స్ చేయనుంది.
ఈ సాయానికి గానూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. తమ దేశానికి ఆర్థిక ఇబ్బందులున్న కష్టకాలంలో ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలని ట్వీట్ చేశారు.
సౌదీ ఆర్థిక సాయంతో పాకిస్థాన్ రూపాయి కోలుకుంటుందని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు శౌకత్ తరిణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్ సాయం చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఇమ్రాన్‌తో చర్చల సందర్భంగా ప్రిన్స్ సల్మాన్ చెప్పారని మీడియా సమావేశంలో వెల్లడించారు. సౌదీ ఆర్థిక ప్యాకేజీతో అంతర్జాతీయ ద్రవ్యనిధి కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని శౌకత్ స్పష్టం చేశారు.
పొరుగు దేశం అఫ్గానిస్థాన్‌కు డాలర్లు అక్రమంగా తరలిస్తుందనే కారణంతో పాకిస్థాన్ కరెన్సీ ఈ ఏడాది మే నుంచి 13.6శాతం పడిపోయింది.
పాకిస్థాన్‌కు 2018లో 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది సౌదీ. విదేశీ మారక నిల్వల కోసం మరో 3 బిలియన్ డాలర్ల చమురు సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్ల 3 బిలియన్ డాలర్లలో 2 బిలియన్ డాలర్లను తిరిగి వెనక్కి ఇచ్చేసింది పాక్. ఇప్పుడు మళ్లీ ఇమ్రాన్ ఖాన్ మూడు రోజుల సౌదీ పర్యటన అనంతరం సంబంధాలు మెరుగుపడ్డాయి.
ఇదీ చదవండి: తాలిబన్లకు చైనా భారీ సాయం- పాక్‌తో కలిసి...