వరుస క్షిపణి పరీక్షలతో(North Korea nuclear missile) కలకలం సృష్టిస్తున్న ఉత్తర కొరియా ఇప్పుడు అణు కార్యక్రమంపైనా దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. తన యాంగ్‌బ్యాన్ అణు కేంద్రంలో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని విస్తరిస్తోంది. ఇటీవలి ఉపగ్రహ చిత్రాల్లో ఇది బయటపడింది. అణు బాంబు తయారీకి(Nuclear bomb test North Korea) అవసరమైన పదార్థాల ఉత్పత్తిని పెంచాలన్న ఉత్తర కొరియా ఉద్దేశం దీని ద్వారా స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు.
యురేనియం శుద్ధి కర్మాగారం పక్కనే ఉన్న ఒక ప్రదేశంలో నిర్మాణాలు జరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఈ నెల 1న తీసిన ఫొటోల్లో.. చెట్లను తొలగించి, నిర్మాణం కోసం నేలను సిద్ధం చేయడం కనిపించింది. తవ్వకాలకు సంబంధించిన యంత్రాలూ అక్కడ ఉన్నాయి. 14న క్లిక్‌మనిపించిన ఫొటోల్లో.. గోడ నిర్మించినట్లు, పునాదుల పనులు మొదలైనట్లు స్పష్టమైంది. "వెయ్యి చదరపు మీటర్లలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంత చోటులో వెయ్యి సెంట్రిఫ్యూజులను ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల ఆయుధగ్రేడు యురేనియం ఉత్పత్తిని 25 శాతం మేర పెంచొచ్చు" అని అమెరికా మేధోమథన సంస్థ మిడిల్‌బరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన జెఫ్రీ లెవిస్ చెప్పారు. అణ్వస్త్రాలను(North Korea nuclear weapons).. భారీగా శుద్ధి చేసిన యురేనియం లేదా ప్లుటోనియంతో తయారుచేయవచ్చు. యాంగ్‌బ్యాన్ కర్మాగారంలో ఈ రెండు రకాల ఇంధనాలను ఉత్పత్తి చేసే వీలుంది. ఇంకా పలు చోట్ల కూడా అణు కార్యకలాపాలను ఉత్తర కొరియా పునఃప్రారంభిస్తున్నట్లు గత నెలలో వెల్లడైన ఉపగ్రహ చిత్రాలు స్పష్టంచేస్తున్నాయి.
తనపై ఉన్న ఆంక్షలను ఉపసంహరిస్తే యాంగ్‌బ్యాన్ అణు కర్మాగారాన్ని పూర్తిగా తొలగిస్తామని ఉత్తర కొరియా.. 2019లో అమెరికాకు ప్రతిపాదించింది. అయితే ఇది పరిమిత స్థాయి చర్యేనంటూ అగ్రరాజ్యం దీన్ని తోసిపుచ్చింది.
ఇదీ చూడండి: స్పేస్ఎక్స్ తొలి ప్రైవేటు స్పేస్ టూర్ విజయవంతం