Russia attack Ukraine: ప్రపంచదేశాలు తమకు రక్షణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. తమ గగనతలాన్ని రష్యా నుంచి రక్షించుకునేందుకు సాయం చేయాలని కోరారు. పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో జెలెన్స్కీ ఈమేరకు ప్రపంచ దేశాలను కోరారు. ఇది ఇక్రెయిన్పై మాత్రమే కాదని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు.
అంతకుముందు యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు శాయశక్తులా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఉక్రెయిన్ రాయబారి సెర్గియ్ కిలిస్యా. ఇప్పటికే ఆలస్యమైందని, అన్ని దేశాలు తమకు సహకరించాలన్నారు. ఐరాస భద్రతా మండలి నిర్వహించిన అత్యవసరం సమావేశంలో ఈ మేరకు కోరారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తమపై దండయాత్ర మొదలుపెట్టాడని, చాలా నగరాలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి మిట్రో కులేబా ఆవేదన వ్యక్తం చేశారు.
'పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించారు. ప్రశాంతంగా ఉన్న దేశంలోని నగారాల్లో అలజడులు మొదలయ్యాయి. దాడులు జరుగుతున్నాయి. ఇది దురాక్రమణ యుద్ధం. ఉక్రెయిన్ తనను తాను కాపాడుకోగలదు. విజయం సాధించగలదు' అని కులేబ ట్వీట్ చేశారు.
Russia ukraine conflict
తూర్పు ఉక్రెయిన్‌లో డొన్బాస్ను రక్షించేందుకు మిలిటరీ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పుతిన్ ప్రకటించిన అనంతరం కులేబ ఈ ట్వీట్ చేశారు.
అయితే రష్యా చర్యను ఐరాస భద్రతామండలి సమావేశంలో ఆ దేశ విదేశాంగ మంత్రి వాసిలీ అలెక్సీవిచ్ నెబెన్జ్యా సమర్థించారు. ఉక్రెయిన్ చర్యలే ప్రస్తుత సంక్షోభానికి కారణమని ఆరోపించారు. చాలా ఏళ్లుగా ఆ దేశం తన బాధ్యతలను విస్మరించిందని, అందుకే తూర్పు ఉక్రెయిన్ను కాపాడే బాధ్యతను తాము తీసుకున్నాని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రకటించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా చాలా దేశాల అధినేతలు ఖండించారు. దీనివల్ల తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు తాము సాయం అందిస్తామని చెప్పారు. యుద్ధం వల్ల జరిగే విధ్వంసానికి, ప్రాణనష్టానికి రష్యాదే పూర్తి బాధ్యత అని బైడెన్ అన్నారు.
ఇవీ చదవండి