ఇప్పటికే కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ప్రకటించిన రష్యా.. తాజాగా మరో ఔషధానికి అనుమతించింది. మోతాదు లక్షణాలున్న కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు 'కరోనావిర్' అనే ఔషధాన్ని తీసుకొచ్చింది. వచ్చే వారం నుంచి దీన్ని సాధారణ మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు అనుమతించింది. ఈ మందును ఆర్-ఫార్మ్ అనే కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. మేలో అవిఫవిర్ అనే జనరిక్ ఔషధానికి కూడా రష్యా అనుమతించింది. అయితే, దీన్ని సాధారాణ మందుల దుకాణాల్లో కాకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడాలని సూచించింది. ఈ రెండు ఔషధాలు ఫవిపిరవిర్ ఆధారంగా అభివృద్ధి చేసినవే.
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్, ఔషధాన్ని కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో టీకా కనిపెట్టినట్లు తొలుత ప్రకటించిన రష్యా.. దాని ఔషధాల్ని కూడా వేగంగా తీసుకొచ్చేందుకు పావులు కదుపుతోంది. తద్వారా కరోనా వైరస్‌పై విజయం సాధించే క్రమంలో నెలకొన్న పోటీలో ముందుండేందుకు ప్రయత్నిస్తోంది. కరోనావిర్‌కు జులైలోనే ప్రయోగాత్మకంగా వినియోగించేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం దీని క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉండగానే మార్కెట్లో విక్రయానికి అనుమతించారు. ఇప్పటికే ఆర్-ఫార్మ్ కరోనావిర్‌కు సంబంధించిన ఆర్డర్లను స్వీకరిస్తోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కోసం సైతం వివిధ దేశాలు ఒప్పందాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఫావిపిరవిర్‌ను భారత్‌లోనూ వివిధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదీ చూడండి:- రష్యా టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్!