ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 32 లక్షల 45 వేల మందికి పైగా వైరస్ సోకింది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటి వరకు 2 లక్షల 29 వేలకు పైగా మరణాలు సంభవించాయి. 10,16,446 మంది బాధితులు కోలుకున్నారు.
రష్యాలో లక్ష దాటిన కేసులు
రష్యాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 7,099 మందికి వైరస్ సోకడం వల్ల ఆ దేశంలో కొవిడ్-19 బాధితులు లక్ష దాటారు. మరో 100 మందికి పైగా మృతి చెందగా.. ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడి మరణించినవారి సంఖ్య 1,073కు చేరింది. 11,619 మందికి వైరస్ నయమైంది.
స్పెయిన్‌లో 268 మంది మృతి
స్పెయిన్‌లో కరోనా మరణాలు ఆగట్లేదు. ఇవాళ 268 మంది మృతి చెందినట్లు అ దేశ యంత్రాంగం ప్రకటించింది. మరో 2,700 మందికి వైరస్ సోకినట్లు తెలిపింది. దీంతో ఆ దేశంలో మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 2,39,639కు చేరింది. వీరిలో 1,37,980 మంది రికవరీ అయ్యారు.
దక్షిణాఫ్రికాలో 5వేలు
దక్షిణాఫ్రికాలో అమలు అవుతోన్న లాక్‌డౌన్‌ను సడలించాలని ప్రభుత్వం ఇటీవలే చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఎన్నడూ లేనన్ని కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. మొత్తం 354 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. దీంతో దేశంలో మొత్తం 5,350 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు.
సింగపూర్‌లో వైరస్ ప్రతాపం
సింగపూర్‌లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 690 మందికి వైరస్ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 15,641కి చేరింది. కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 14 మంది మాత్రమే మృత్యువాతపడటం గమనార్హం.
ఆస్ట్రేలియా రాజధానిలో కేసులు సున్నా
ఆస్ట్రేలియాలోని 8 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. వీటిలో ప్రధానంగా దేశ రాజధానిలో కూడా కొత్తగా ఎవ్వరికీ వైరస్ సోకలేదని వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6,753 మంది వైరస్ బారిన పడగా.. ఇద్దరు మాత్రమే మృతి చెందారు.
జర్మనీలో లాక్‌డౌన్‌ను సడలించొద్దు...
కరోనా మహమ్మారి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ను సడలించడం ప్రమాదమని హెచ్చరించారు ఆదేశ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్ స్పాన్. ఈ నిర్లక్ష ధోరణి వల్ల ఇప్పటివరకు సాధించిన విజయమంతా గంగపాలవుతుందని అన్నారు. ఇప్పటి వరకు మొత్తం లక్షా 61 వేల మందికి పైగా వైరస్ సోకింది. అంతేకాకుండా 6,467 మందిని మహమ్మారి బలి తీసుకుంది.
మెక్సికోలో వెయ్యికి పైగా కేసులు
మెక్సికోలో ఇవాళ వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. మరో 163 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 1,732కు చేరింది. దేశంలో 17,799 మంది మహమ్మారి బాధితులు ఉండగా.. 11,423 మంది ఆసుపత్రి నుంచి కోలుకున్నారు.
ఇరాన్లో 24 గంటల్లో 983 కేసులు
ఇరాన్లో కొత్తగా 983 కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 93,657కు పెరిగింది. అక్కడ ఇప్పటి వరకు 6వేలకు పైగా మరణాలు సంభవించాయి.
బెల్జియంలోనూ పెరుగుతున్న కేసులు
బెల్జియంలో రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న కారణంగా ఆ దేశంలో మొత్తం 48,519 మందికి వైరస్ సోకింది. గురువారం ఒక్కరోజే 93 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 7,594 మంది మరణించారు.
నెదర్లాండ్‌లో 514 కేసులు
నెదర్లాండ్‌లో గడిచిన 24 గంటల్లో 514 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. దీంతో బాధితుల సంఖ్య 39,516కు పెరిగింది. వీరిలో 4,795 మంది వైరస్‌కు బలయ్యారు.
యూఏఈలో భారత సంతతి మహిళ మృతి
యూఏఈలో భారత సంతతికి చెందిన ఓ మహిళ మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు అక్కడ 98 మంది మరణించారు. 11,929 మందికి వైరస్ సోకింది.