మహమ్మారి ఉద్ధృతిని కట్టడి చేయాలంటే టీకా ఒక్కటే మార్గం. పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్న వేళ వ్యాక్సినేషన్‌కు ముందుకు రాని ప్రజలకు ఎలాగైనా టీకా ఇప్పించేందుకు రష్యా రాజధాని మేయర్ వినూత్న ప్రతిపాదనను తీసుకొచ్చారు. కరోనా టీకా తీసుకున్న వారికి 9.85 లక్షల రూబెల్స్కు (రూ.10 లక్షలు) పైగా విలువ చేసే కారును పొందవచ్చని పేర్కొన్నారు.
ఈ ఆఫర్ ఎప్పటివరకు.. ?
మాస్కో మేయర్ సేర్గీ సోబ్యానిన్ ప్రకటించిన ఈ ఆఫర్ సోమవారం నుంచి జులై 11 వరకు ఉంటుంది. ఈ సమయంలో 18 ఏళ్ల దాటిని వారు టీకా తొలి డోసు తీసుకుంటే వారు లక్కీ డ్రాకు ఎంపిక అవుతారు. వారానికి 5 చొప్పున నాలుగు వారాల్లో 20 కార్లను ప్రభుత్వం టీకా తీసుకున్న వారికి అందించనుంది.
ఎందుకీ ఆఫర్..?
రష్యాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. మాస్కోలో అయితే ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. ప్రజలు మాత్రం ఆసక్తి కనబరచట్లేదు. మే 21 నాటికి 1.2 కోట్ల మందిలో 13 లక్షల మందే టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మాస్కో మేయర్ ఈ వినూత్న ప్రయత్నం చేపట్టారు.
ఇదీ చదవండి : సూది భయం.. కొవిడ్ టీకాకు ఆమడ దూరం