పరస్పర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ద్వైపాక్షిక సంబంధాల్లో సున్నితమైన సమస్యలను సరైన రీతిలో పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. భారత్, రష్యా, చైనా ఈ విషయంలో దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో భారత్, రష్యా, చైనా మధ్య జరిగిన త్రైపాక్షిక భేటీలో భాగంగా వాంగ్ యీ మాట్లాడారు. భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతలను నేరుగా ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు.
సహకారం పెరగాలి..
మూడు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం పెంచడానికి ఆర్‌ఐసి రక్షణ మంత్రుల సమావేశం నిర్వహించాలన్న రష్యా ప్రతిపాదనకు వాంగ్ యీ మద్దతు తెలిపారు.
"భారత్, చైనా, రష్యా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కలిగిన పెద్ద పెద్ద దేశాలు. ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర ప్రయోజనాలు కాపాడుకునేందుకు సున్నితమైన అంశాల్లో సరైన మార్గాలను అన్వేషించాలి. మూడు దేశాలూ సహకారాన్ని పెంచుకునే అవకాశాలను సృష్టించుకోవాలి. "
- వాంగ్ యీ, చైనా విదేశాంగ మంత్రి
త్రైపాక్షిక కూటమి..
భారత్, చైనా, రష్యాలు.. బహుపాక్షిక సంబంధాలకు కట్టుబడి ప్రపంచ పాలనను మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు వాంగ్ యీ. రెండో ప్రపంచ యుద్ధం విజయాన్ని నిశ్చయంగా కాపాడుకోవాలని, అంతర్జాతీయ సంబంధాలలో ప్రజాస్వామీకరణ, చట్ట పాలనను ప్రోత్సహించాలని వెల్లడించారు.
అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు లోబడి వాణిజ్యం, స్వేచ్ఛా రవాణా, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. మూడు దేశాలు కలిసి ఉమ్మడి శక్తిగా ఏర్పడాలని ప్రతిపాదించారు వాంగ్ యీ. కరోనా వైరస్ విషయంలో పారదర్శకంగా వ్యవహరించామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: చైనా వెన్నుపోటు- నేపాల్ భూభాగం దురాక్రమణ