ఫోకస్ చేయాల్సిన అవసరం లేని ఒక వినూత్న కెమెరాను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం అంగుళంలో వెయ్యో వంతు మందం కలిగిన ఒకే లెన్స్‌ను ఉపయోగించారు. ఈ పరిశోధక బృందానికి భారత సంతతికి చెందిన రాజేశ్ మేనన్ నాయకత్వం వహించారు. ఈ ఆవిష్కారం వల్ల మరింత పలుచటి స్మార్ట్‌ఫోన్ కెమెరాలు, ఎండోస్కోపీ వంటి వైద్యపరమైన ఇమేజింగ్ సాధనాల్లో మెరుగైన, చిన్న కెమెరాలు సాకారమవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
అలాగే వాహనాల కోసం మరింత చిన్న కెమెరాలను రూపొందించొచ్చని వివరించారు. ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్లలోని కెమెరాల్లో నాణ్యమైన, 'ఇన్-ఫోకస్' చిత్రాల కోసం బహుళ లెన్సులను ఉపయోగించాల్సి వస్తోంది. పరస్పరం ఆరు మీటర్ల దూరంలో ఉన్న రెండు వస్తువులపైనా కొత్తగా రూపొందించిన లెన్స్ ఫోకస్ పెట్టగలదని రాజేశ్ పేర్కొన్నారు. ఈ లెన్సుల్లో చదునైన ఉపరితలంపై నానో ఆకృతులను రూపొందించారు. తద్వారా కాంతి ప్రయాణ తీరుతెన్నులను నియంత్రించే సామర్థ్యాన్ని సాధించారు.
ఇదీ చూడండి: కరోనా ముప్పుతో స్వీయ నిర్బంధంలోకి ప్రధాని