తాలిబన్ల ఆక్రమణతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న అఫ్గాన్ ప్రజల వెన్నులో వణుకు పుట్టించే వార్త మరొకటి బయటకు వచ్చింది. ఓ గ్రామంపై తాలిబన్ ఫైటర్లు(Taliban fighters in Afghanistan) విరుచుకుపడి, అక్కడి మైనారిటీలను చిత్రహింసలు పెట్టి హత్య చేశారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇది అఫ్గాన్ ప్రజలను కలవరపెడుతోంది.
తుపాకులతో.. 'శాంతి జపం'
20ఏళ్ల ముందు తాలిబన్ల(Taliban news) పాలనలో అఫ్గానిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. మహిళలపై ఆంక్షలతో విరుచుకుపడ్డారు తాలిబన్లు. వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అనంతరం రంగంలోకి దిగిన అమెరికా దళాలు తాలిబన్లను తరిమికొట్టాయి. అనంతరం ఆ దేశం ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టింది.
తాజాగా.. 20ఏళ్ల అమెరికా, అఫ్గాన్ దళాల శ్రమ వృథా అయిపోయింది. అమెరికా దళాలు దేశం నుంచి వెనుదిరుగుతుండటం మంచి అవకాశంగా భావించిన తాలిబన్లు రెచ్చిపోయారు. ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ దూసుకెళ్లారు. గత ఆదివారం కాబుల్ వారి వశమైన వేళ తాలిబన్ల మెరుపువేగానికి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఇక అఫ్గాన్ ప్రజల ఆవేదన వర్ణణాతీతం. చాలా మంది దేశాన్ని విడిచిపెట్టి పారిపోవడానికి విమానాశ్రయం చుట్టుముట్టారు. ఈ క్రమంలో పలువురు మరణించారు.
ఇదీ చూడండి:- ఆఫీస్‌లోకి నో ఎంట్రీ- తాలిబన్ల రాజ్యంలో ఇంతే!
అయితే గత పాలనకు తాము భిన్నంగా వ్యవహరిస్తామని తాలిబన్లు ఇటీవలే ప్రకటించారు. ప్రజలు(Afghanistan Crisis) భయపడకూడదని, దేశాన్ని విడిచివెళ్లకూడదని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలను పునరుద్ధరిస్తామని హామీనిచ్చారు. తమపై ఉన్న మచ్చను చెరిపుకునేందుకు మత పెద్దల మద్దతు తీసుకుంటున్నారు. తమపై సానుకూల ప్రవచనాలు చేయాలని శుక్రవారం ప్రార్థనలకు ముందు మతపెద్దలను కోరారు తాలిబన్ నేతలు.
ఈ తరుణంలో ఘాంజీ రాష్ట్రంలో తాలిబన్లు ఊచకోతకు పాల్పడ్డారన్న అమ్నెస్టీ ఇంటర్నెషనల్ నివేదిక వారి వక్రబుద్ధిని బయటపెడుతోంది. ఈ వార్త అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జులై 4-6 మధ్యలో మున్దర్ఖ్త్ గ్రామంపై తాలిబన్లు విరుచుకుపడ్డారని, ఆరుగురు హజారా జాతికి చెందిన పురుషులను కాల్చిచంపారని నివేదిక పేర్కొంది. మరో ముగ్గురిని చిత్రహింసలకు గురిచేసి చంపారని వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షులను ఇంటర్వ్యూ కూడా చేసింది.
ఆక్రమించుకున్న అనేక ప్రాంతాల్లో సెల్‌ఫోన్ సర్వీసులను తాలిబన్లు నిలిపివేసిన కారణంగా.. ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగు చూడకపోయి ఉండొచ్చని ప్రజలు అనుమానిస్తున్నారు. అందుకే శాంతి మంత్రాన్ని జపిస్తున్నా.. తాలిబన్ల నిజస్వరూపం ఏదో ఒకరోజు బయటపడుతుందని భయపడుతున్నారు.
దౌత్య కార్యాలయాలపై దాడి..
ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక దౌత్య, వాణిజ్య సంబంధాలు కోరుకుంటున్నామని చెబుతున్నప్పటికీ.. చేతల్లో మాత్రం అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారు. అఫ్గాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లాక.. భారత్ సహా పలుదేశాలు దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి సిబ్బందిని స్వదేశాలకు తరలించాయి. కాందహార్, హెరాత్ నగరాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో కీలక పత్రాల కోసం బుధవారం నాడు తాలిబన్లు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసిందని ప్రభుత్వ వర్గాలు(Afghanistan news) వెల్లడించాయి. రెండు నగరాల్లోని దౌత్య కార్యాలయాల్లో ఎలాంటి పత్రాలు లభించకపోవడం వల్ల... అక్కడ ఉన్న వాహనాలను తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇల్లిల్లు వెతుకుతూ..
గత నెల భారత్‌కు చెందిన రాయిటర్స్ ఫొటో జర్నలిస్ట్‌ను చంపిన తాలిబన్లు(Taliban news today).. తాజాగా జర్మనీకి చెందిన ఓ పాత్రికేయుడి బంధువును కాల్చేశారు. ముష్కరుల కాల్పుల్లో మరో బంధువు కూడా తీవ్రంగా గాయపడినట్లు జర్మనీ వార్తా సంస్థ ప్రకటించింది. తమ ఎడిటర్ కోసం ఇల్లిల్లు వెతుకుతూ.. ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పేర్కొంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన జర్మనీకి చెందిన వార్తా సంస్థ.. అఫ్గాన్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. జర్మనీ ప్రభుత్వం తక్షణం స్పందించి తమ సిబ్బందిని కాపాడాలని వార్తా సంస్థ విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి:- అమెరికా ఖర్చు ఘనం- ఫలితం మాత్రం...