ఇరాక్‌లో సద్దుమణిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మళ్లీ పుంజుకున్నాయి. అవినీతి, నిరుద్యోగం, పేలవమైన ప్రభుత్వ సేవల పట్ల అసంతృప్తిగా ఉన్న దేశ ప్రజలు రాజధాని బగ్దాద్‌లో నిరసనలకు దిగారు. రోడ్లపైకి వచ్చి వాహనాలను ధ్వంసం చేశారు. టైర్లకు నిప్పంటించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు చేయడానికి రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో పోలీసులపై నిరసనకారులు దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. నిన్నటి నుంచి కొనసాగుతున్న ఈ అల్లర్లలో దాదాపు 27మంది గాయపడ్డారు.
ఇరాక్ ప్రభుత్వాన్ని గద్దె దించేలా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
సులేమానీ మరణంతో...
గత ఏడాది అక్టోబర్ 1న ఇరాక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు భగ్గుమన్నాయి. కానీ బాగ్దాద్‌లో ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సులేమానీని అమెరికా హతమార్చిన నేపథ్యంలో ఈ నిరసనలు పక్కదారి పట్టాయి. అనంతరం అమెరికా- ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టింది. దీనితో ఇరాక్ అంతటా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
ఇదీ చూడండి : నిర్భయ దోషి 'మైనర్' పిటిషన్ కొట్టివేత- ఉరే తరువాయి