కార్చిచ్చుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తూర్పు ఆస్ట్రేలియాలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. దావానలం ప్రభావిత ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరిన్ని రోజులు వానలు కురుస్తాయనేదానికి సంకేతంగా ఆకాశం మేఘావృతమైంది. దీంతో ప్రజలకు, అధికారులకు కాస్త ఊరట లభించింది.
కార్చిచ్చుతో వెలువడిన పొగ కారణంగా ఆస్ట్రేలియాలో వాయు నాణ్యత గణనీయంగా పడిపోయింది. అయితే... తాజాగా కురిసిన వర్షంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది.
"రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడింది. వారాంతారాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే జరిగితే గత ఏడాది సెప్టెంబర్(కార్చిచ్చు రగులుతున్నపటి) నుంచి తొలిసారి ఎక్కువ రోజులు పాటు వర్షం కురిసినట్లవుతుంది."
-విక్టోరియా పర్యావరణ రక్షణ సంస్థ.
ఇప్పటివరకు వాతావరణం వేడిగా ఉండడం, అరుదుగా తేలికపాటి వర్షం మాత్రం కురవడం వల్లే కార్చిచ్చు అదుపులోకి రాలేదు. తాజాగా వచ్చిన మార్పులతో ఈ వారాంతంలో వర్షం బాగా పడితే దావానలం కొంతైనా తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు.
అపార నష్టం
కార్చిచ్చు ధాటికి ఇప్పటివరకు 2వేలకుపైగా ఇళ్లు, 10మిలియన్ల ఎకరాల అడవి కాలి బూడిదయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి :ఆమె 'వాలు జడ'కు చిక్కిన గిన్నిస్ రికార్డు