ఒకప్పుడు ఆడపిల్లలు.. కేశాలు ఎంత పొడవుంటే అంత గొప్పగా భావించేవారు. పొడవైన జడతోనే అందం అని అనుకునే వారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ అంటూ మొగవారికి దీటుగా కేశాలను రకరకాల ఆకృతిలో కత్తిరిస్తున్నారు.
కానీ గుజరాత్‌కు చెందిన 17ఏళ్ల నిలాంషి పటేల్.. పొడవాటి కేశాలతో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. తన రికార్డును తానే బద్దలు కొట్టింది కూడా. 2018లో 170.5 సెంటీమీటర్ల పొడవు కేశాలతో రికార్డు సృష్టించిన నిలాంషి.. తాజాగా 190 సెంటీమీటర్ల పొడవుగా కేశాలను పెంచింది. ఫలితంగా ప్రపంచంలో అతి పొడవైన కేశాలు కల్గిన యువతిగా మరోసారి గుర్తింపు పొందింది.
ఈ ఘనత తన తల్లికే చెందుతుందని నిలాంషి తెలిపింది. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన తనను మార్చేసిందని పేర్కొంది.
"నేను ఆరేళ్ల వయస్సులో నా కేశాలను కత్తిరించుకున్నాను. అప్పుడు అవి ఎంతో చిన్నవిగా, పెలుసుగా అయిపోయాయి. ఇక ఎప్పుడూ శిరోజాలు కత్తిరించుకోకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి కేశాలు పెంచడం ప్రారంభించాను. ఈ ఘనత మా అమ్మకు దక్కుతుంది. ఈ విషయంలో అమ్మ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. ఈ పొడవైన కేశాల వల్ల.. నువ్వు ఈ పని చేయాలేవు, ఆ పని చేయలేవని నన్ను ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. ఆమె వల్లనే నేను ఈ రికార్డు సాధించా. అమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు ప్రపంచంలో నెను ఓ సెలబ్రిటీ అయ్యాను."
-నిలాంషి పటేల్, గుజరాత్ వాసి.
భవిష్యత్తులో మరిన్ని వరల్డ్ రికార్డులు సాధించడమే తన లక్ష్యం అని పేర్కొంది నిలాంషి పటేల్.
ఇదీ చూడండి : 'నోట్లపై లక్షీదేవి ఉంటే 'రూపాయి' చల్లగా ఉంటుంది'