తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న పాకిస్థాన్ ప్రభుత్వం.. అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ప్రధాన మంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది.
"ఇస్లామాబాద్ రెడ్జోన్లోని ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో ప్రజలు సాంస్కృతిక, ఫ్యాషన్, విద్యకు సంబంధించిన సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం రెండు కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఆయా కార్యక్రమాల సమయంలో ప్రధాని ఇంటి ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఆయా కమిటీలు చూస్తాయి" అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని ఇంటికి ఎంత అద్దె వసూలు చేయాలి వంటి విషయాలపై మంత్రివర్గం త్వరలోనే చర్చించి, నిర్ణయం తీసుకుంటుందని ఆయా వర్గాలు తెలిపాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా..
2018లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రభుత్వం వద్ద సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు డబ్బు లేకపోయినా.. కొందరు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని అన్నారు. తాను మాత్రం అందుకు విరుద్ధమని చెప్పారు. ప్రభుత్వ భవనాన్ని వీడి.. సొంత నివాసంలోనే ఉంటున్నారు.
ఖాళీగా ఉన్న ప్రధాని అధికారిక నివాసాన్ని విశ్వవిద్యాలయంగా మార్చుతామని 2019 ఆగస్టులో ప్రకటించింది పాక్ ప్రభుత్వం. ఇప్పుడు అందుకు భిన్నంగా.. ఆ ఇంటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది.
అప్పుల ఊబిలో..
ఇమ్రాన్ ఖాన్ అధికారం చేపట్టాక గత మూడేళ్లలో పాక్ ఆర్థిక వ్యవస్థ 1900 కోట్ల డాలర్ల మేర క్షీణించింది. ఖర్చులు తగ్గించేందుకు ఆయన అనేక పొదుపు చర్యలు చేపట్టినా.. పెద్దగా ఫలితం లేదు. ఇమ్రాన్ వల్ల ప్రభుత్వ రుణాలు రూ.45 వేల బిలియన్లకు పెరిగాయన్నది విపక్షాల ఆరోపణ.
ఇదీ చూడండి: తాలిబన్లు అంటే ఉగ్రవాదులు కాదు: పాక్ ప్రధాని