ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. రోజూ లక్షలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 42, 557 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 85,57,535కు చేరింది. 4,45,986 మంది మృతి చెందారు.
ప్రపంచ యుద్ధం కన్నా ఎక్కువ
అమెరికాలో మంగళవారం ఒక్కరోజే 25,450 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 22,08,400కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 1,16,526 మంది మరణించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మృతి చెందిన అమెరికా సైనికుల సంఖ్య(1,16,516)తో పోల్చితే ఇది ఎక్కువ.
దక్షిణ అమెరికా దేశాల్లో..
దక్షిణ అమెరికా దేశాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. బ్రెజిల్లోనూ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,278 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 9,28,324కు చేరుకుంది. కొత్తగా 1,338 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 45 వేలు దాటింది. పెరూలో ఒక్కరోజులో 4 వేల కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 2.40 లక్షలకు చేరువైంది. చిలీలో గడిచిన 24 గంటల్లో 5 వేలకుపైగా కేసులు పెరిగాయి. మొత్తం సంఖ్య 1.84 లక్షలకు ఎగబాకింది.
రష్యాలో..
రష్యాలోనూ కరోనా బీభత్సం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8వేల మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5.50 లక్షలకు చేరువైంది. కరోనా బారిన పడి 7,284 మంది మృతిచెందారు.
దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, కంబోడియాలోనూ కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి.
ఇదీ చూడండి:ధర నిర్ణయించే స్వేచ్ఛ రైతుకేదీ?