జమ్ముకశ్మీర్ విభజన, అధికరణ 370 రద్దు చేసి 4 నెలలు గడిచినా ఈ అంశంపై పాకిస్థాన్ తన వక్రబుద్ధిని చూపుతూనే ఉంది. అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టాలని చూసి బోల్తాపడినప్పటికీ.. కశ్మీర్ అంశాన్ని వీడటం లేదు. కశ్మీర్ పరిస్థితులపై దృష్టి సారించాలని కోరుతూ.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, భద్రతా మండలి అధ్యక్షుడికి మరోమారు లేఖ రాశారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ.
ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఐరాస భద్రత మండలికి ఎప్పటికప్పుడు కశ్మీర్ పరిస్థితులను ఖురేషీ వివరిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది.
ఈ నెల 12న లేఖ...
తాజాగా ఈ నెల 12న లేఖ రాశారు ఖురేషీ. దక్షిణాసియాలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను భారత్ తీసుకుంటున్న చర్యలు మరింత పెంచుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఐరాస భద్రత మండలి తన సరైన పాత్రను పోషించాలని కోరారు. దక్షిణాసియాలో శాంతిభద్రతకు విఘాతం కలగటం, కశ్మీరీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని తెలిపారు. కశ్మీర్‌పై అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు భారత్ తప్పుడు ప్రచారాలు చేపడుతోందని పేర్కొన్నారు ఖురేషీ.
గతంలో ఆరుసార్లు..
గతంలో ఆగస్టు 1,6,13,26, సెప్టెంబర్ 12, అక్టోబర్ 31న పలుమార్లు ఐరాస ప్రధాన కార్యదర్శి, యూఎన్ఎస్ అధ్యక్షుడికి లేఖలు రాశారు ఖురేషీ.