కరోనా కట్టడిలో యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన న్యూజిలాండ్‌లో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతుండటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. గురువారం తాజాగా 17 కేసులు వెలుగుచూసినట్టు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే కరోనా 2.0 వ్యాప్తి ఎలా జరుగుతోందన్న విషయం అంతుచిక్కకపోవడం ఆందోళనకర అంశం.
ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి ఆక్లాండ్‌లో విధించిన 3 రోజుల లాక్‌డౌన్‌ను మరింత పొడిగించే అవకాశముంది. ఈ విషయంపై ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ శుక్రవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అన్నీ బంద్...
న్యూజిలాండ్‌లో సాధారణ పరిస్థితులు ఎప్పుడో నెలకొన్నాయి. ఎన్నో రోజుల నుంచి రెస్టారెంట్లు, స్టేడియంలు కిటకిటలాడుతున్నాయి. ఎలాంటి భయం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ రోజువారీ పనుల్లో మునిగిపోతున్నారు. స్థానికంగా కేసులు నమోదయి 100 రోజులు దాటిన నేపథ్యంలో ఆదివారమే అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
న్యూజిలాండ్‌లో కొన్ని నెలలుగా నమోదవుతూ వస్తున్న కేసులన్నీ విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులవే. వారందరినీ క్వారంటైన్‌లోనే ఉంచుతున్నారు అధికారులు. కానీ ఈ వారంలో అనూహ్యంగా.. ఆక్లాండ్‌లోని ఓ నివాసంలో నలుగురిలో కరోనాను గుర్తించారు ఆరోగ్య సిబ్బంది.
ఈ నేపథ్యంలో బుధవారం ఆక్లాండ్‌లో లెవల్ 3 హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. నిత్యవసరాల కోసం తప్ప అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. బార్లు, రెస్టారెంట్లు, వ్యాపారాలు మళ్లీ మూతపడ్డాయి. దేశంలోని మిగిలన ప్రాంతాల్లో భౌతిక దూరంతో పాటు లెవల్ 2 నిబంధనలను అమలు చేశారు.
దేశంలో ఇప్పటివరకు 1,589 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద 22 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చూడండి:- అరకోటి మందికి 'అమ్మ'గా ఆ దేశ ప్రధాని