అఫ్గానిస్థాన్ రాజధానిలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు(Kabul protest) దిగారు ఆ దేశ ప్రజలు. పంజ్‌షేర్ ప్రావిన్స్‌లో(panjshir valley) పాక్ జెట్స్ వైమానిక దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ.. కాబుల్ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో మహిళలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 'పాకిస్థాన్‌కు మరణం' 'స్వేచ్ఛ' ' అల్లాహ్ అక్బర్' 'మాకు బంధీఖానాలు వద్దు' వంటి నినాదాలు చేశారు. పాకిస్థాన్ ఎంబసీ ఉద్యోగులు తమ దేశాన్ని విడిచి వెళ్లాలని డిమాండ్ చేశారు. తమకు ఒకరి చేతిలో ఉండే కీలబొమ్మ ప్రభుత్వం అవసరం లేదని, అందరి భాగస్వామ్యంతో ఉండే ప్రభుత్వం కావాలన్నారు.

పంజ్‌షేర్‌ను తమ వశం చేసుకున్నట్లు తాలిబన్లు సోమవారం ప్రకటించారు. ఈ క్రమంలోనే తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్ ప్రజలు పోరాడాలని ఆడియా క్లిప్ ద్వారా పంజ్‌షేర్ రెసిస్టెన్స్ ఫోర్స్ నేత అహ్మద్ మసూద్ కోరిన తర్వాత ఆందోళనకారులు పాక్ ఎంబసీ వద్దకు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారని, అయినప్పటికీ నిరసనలు కొనసాగించినట్లు వెల్లడించింది.

బ్లాఖ్, దైకుండి ప్రావిన్స్‌ల్లోనూ సోమవారం రాత్రి ప్రజలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేసినట్లు మీడియా వెల్లడించింది.

జర్నలిస్టుల అరెస్ట్
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తాలిబన్లు కాల్పులు జరిపారు. నిరసనలను ప్రసారం చేస్తోన్న పలువురు అఫ్గాన్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు డిమాండ్ చేశారు.
తమపై తాలిబన్లు దాడి చేసినట్లు అరెస్ట్ అయి విడుదలైన పలువురు పాత్రికేయులు తెలిపారు. 'నిరసనలను కవర్ చేసినందుకు నా ముక్కును నేలపై రాసి.. క్షమాపణలు చెప్పించారు. ప్రాణాలకు రక్షణ లేదు. అఫ్గాన్‌లోని జర్నలిస్టులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.' అని ఓ జర్నలిస్ట్ మీడియాకు తెలిపారు.


ఇదీ చూడండి: Haqqani Taliban: పాక్ స్క్రీన్ ప్లే.. హక్కానీల హైడ్రామా!