ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామంలో పుట్టి పెరిగిన ప్రసాద్ పాండా... కెనడా దేశంలో అనతికాలంలోనే ప్రముఖ రాజకీయ నేతగా ఎదిగారు. తాజాగా అల్బర్టా రాష్ట్ర మౌలిక వసతుల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 15 ఏళ్లుగా కెనడాలో ఉంటున్న ప్రసాద్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా మంత్రి పదవిని సైతం దక్కించుకున్నారు.
మౌలిక వసతుల శాఖ మంత్రిగా బాధ్యతలు
అల్బర్టాలోని ప్రధాని జాసన్ కెన్నీ మంత్రివర్గంలో మౌలిక వసతుల శాఖ మంత్రిగా నియమితులైన ప్రసాద్ పాండా కీలక బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
నాలుగేళ్లలో రూ. లక్షా 15 వేల కోట్లుగా ఉన్న అల్బర్టా మౌలిక వసతుల మూలధన ప్రణాళికకు సాయమందించనున్నారు. ప్రజావసరాలైన ఆసుపత్రులు, పాఠశాలలు, గృహాల నిర్మాణం వంటి వాటి నిర్వహణ అంశాలు పర్యవేక్షిస్తారు. రియల్ ఎస్టేట్ క్రయవిక్రయాలను సైతం ప్రభుత్వపరంగా ఆయన చూసుకోనున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా..
భారత్‌లో పుట్టిన ప్రసాద్ పాండా 15 సంవత్సరాలుగా కెనడా అల్బర్టా రాష్ట్రంలోని కాల్గెరి-ఎడ్జ్మోంట్లో నివసిస్తున్నారు.
అల్బర్టాలోని కాల్గెరి-ఎడ్జ్మోంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేశారు ప్రసాద్ పాండా. ఈ ఏడాది ఏప్రిల్ 16న జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యే పదవి చేపట్టారు.
2015 సెప్టెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అల్బర్టా రాష్ట్రంలోని కాల్గెరీ-ఫుట్‌హిల్స్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఉన్నత పదవుల్లో సేవలు
ప్రజా పద్దులు, అల్బర్టా ఆర్థిక భవిష్యత్తుపై ఏర్పాటైన లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా గతంలో సేవలు అందించారు ప్రసాద్ పాండా. అదే విధంగా ఆర్థిక, వ్యాపారాభివృద్ధి అధికారిక ప్రతిపక్ష విమర్శకుడిగానూ విధులు నిర్వర్తించారు.
ఇంధన, గ్యాస్ రంగాల్లో దశాబ్దాల అనుభవం
అల్బర్టా ప్రొఫెషనల్ ఇంజినీర్స్, జియోసైన్సెస్ అసోసియేషన్ (ఏపీఈజీఏ) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో టెక్నాలజీ బ్యాచిలర్ పట్టా పొందారు ప్రసాద్ పాండా. ఆయిల్, గ్యాస్ వంటి శక్తి ఉత్పాదక రంగంలో 28 ఏళ్ల పాటు ఎన్నో పదవుల్లో విధులు నిర్వర్తించారు.
రిలయన్స్‌లోనూ ఉన్నత పదవులు
గతంలో రిలయన్స్ సంస్థలోనూ ఉన్నత పదవులు చేపట్టారు ప్రసాద్ పాండా. సీనియర్ మేనేజర్ స్థాయి అధికారిగా పని చేశారు. అలాగే సన్కోర్ సంస్థలోనూ విధులు నిర్వర్తించారు. దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం, పెట్రోకెమికల్, పవర్, పైపులైన్లు, మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ సాండ్స్ అభివృద్ధి ప్రాజెక్టులను ఉద్యోగ జీవితంలో నిర్వర్తించారు.
సేవా కార్యక్రమాల్లో ముందు
ప్రసాద్ పాండా నేతృత్వంలోని ఓ బృందం కల్గేరి వెటరన్స్ ఫుడ్ బ్యాంక్ కోసం ప్రతి ఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మాజీ సైనికుల సంక్షేమం కోసం కృషి చేస్తోంది.
తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా..
ప్రవాసాంధ్రుల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు ప్రసాద్ పాండా. కాల్గెరి తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగానూ గతంలో ఆయన సేవలు అందించారు. భారత-కెనడా కాల్గెరి అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడిగానూ పని చేశారు.