రానున్న అనేక తరాలపై ప్రభావం చూపగల స్థాయిలో అసాధారణ పనులు చేయగల సత్తా యువత సొంతమని కొనియాడారు ప్రధాని నరేంద్రమోదీ. ఎలాంటి పరిమితులు లేకుండా, లక్ష్య సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
భూటాన్ పర్యటనలో భాగంగా థింపూలోని రాయల్ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
పర్యటకుల పట్ల భూటాన్ వాసులు చూపే ఆప్యాయతను ప్రత్యేకంగా ప్రస్తావించారు మోదీ. భారత్-భూటాన్ మధ్య బంధం మరింత దృఢపడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
అంకుర సంస్థలకు భారత్ అత్యంత అనువైన దేశంగా మారిందని చెప్పారు మోదీ. విద్య, వైద్యం, ఇతర రంగాల్లో భారత్లో వచ్చిన మార్పులను భూటాన్ విద్యార్థులకు వివరించారు.
"ఆయుష్మాన్ భారత్తో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు భారత్ కేంద్రంగా ఉంది. 50 కోట్ల మంది భారతీయులకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నాం. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకే డేటా అందిస్తున్నాం. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్ల మందికి సాధికారత లభిస్తోంది."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: భూటాన్ రుచులతో మోదీకి పసందైన విందు!