జీ-20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ జపాన్ ఒసాకాలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించారు. ప్రధానంగా సాంకేతిక శక్తిని పెంచే మార్గాలు, రక్షణ, భద్రతా సంబంధాలను మెరుగుపరచటం, వాణిజ్యం,ఇరాన్ వివాదం, 5జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు.
భారత్‌తో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో లేఖ పంపడంపై ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు మోదీ.
"నాలుగు అంశాలపై చర్చే ప్రధాన అజెండా. ఇరాన్, 5జీ, ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సంబంధాలపై విస్తృతంగా చర్చ చేపట్టాం. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉంది. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి
రెండోసారి అధికారం చేపట్టినందుకు మోదీకి ట్రంప్ అభినందనలు తెలిపారు. రక్షణ రంగంతో పాటు వివిధ అంశాల్లో ఇరు దేశాల పరస్పర సహకారం మరింత పెరగాలని అభిలషించారు.
ఇదీ చూడండి: ఉగ్రవాదంపై ఐకమత్యంగా పోరాడదాం:మోదీ