ఇండో-జర్మన్ సంబంధాల బలోపేతంపై విస్తృత చర్చ చేపట్టారు జర్మనీ ఛాన్సిలర్ ఏంజెలా మెర్కెల్, భారత ప్రధాని మోదీ. జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న జీ-20 సదస్సు నేపథ్యంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో ఇరు దేశాల సహాయ సహకారాలపై మాట్లాడారు.
ఇరువురి మధ్య భేటీపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు.
"జీ-20 సదస్సులో భాగంగా జర్మనీ ఛాన్సిలర్ మెర్కెల్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కృత్రిమ మేధస్సు, ఈ-రవాణా, సైబర్ సెక్యూరిటీ, రైల్వే నవీకరణ, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాలపై సహకారం పెంపొందించే విషయాలపై చర్చించారు."
- రవీష్ కుమార్, విదేశాంగ శాఖ ప్రతినిధి.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు మెర్కెల్.
28 సభ్య దేశాల కూటమి యూరోపియన్ యూనియన్‌లో జర్మనీ, భారత్‌తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
ఇదీ చూడండి: మోదీతో భేటీ అనంతరం మెత్తబడిన ట్రంప్