ఫిలిప్పీన్స్‌లో సైనిక విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 50కి చేరింది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది సహా మొత్తం 96 మంది ఉన్నారు. వీరిలో 49 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సైనిక విమానం సీ-130 సులు ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంత పట్టణం, పాటికుల్ సమీపంలో కూలింది. విమానం కూలిన సమయంలో.. కింద ఉన్న మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్ వేను తప్పిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ గాల్లోకి ఎగిరేందుకు పైలట్ ప్రయత్నించే క్రమంలో విమానం కూలిపోయినట్లు సమాచారం.
ప్రమాద సమయంలో.. విమానంలో ముగ్గురు ఫైలట్లు, ఐదుగురు విమాన సిబ్బంది, 88 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాగయాన్ డి ఓరో నగరం నుంచి సైనిక దళాలను వేరే ప్రాంతానికి తరలిస్తుండగా, ప్రమాదం జరిగిందని వివరించారు.
సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్ ఫోర్స్‌లో భాగంగా బలగాలను అక్కడ మోహరించేందుకు పంపినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: బోటు మునిగి 43 మంది మృతి!