ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది పాకిస్థాన్. ఈ విషయాన్ని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహమూద్ ఖురేషి స్పష్టం చేశారు. ఇప్పటికే ఐరాస భద్రతా మండలిలో చర్చకు ప్రయత్నించి చేతులు కాల్చుకుంది పొరుగుదేశం.
కశ్మీర్ అంశాన్ని ఐరాస భద్రతామండలి, అంతర్జాతీయ న్యాయస్థానం సహా అన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తామని ఆ దేశ పార్లమెంటులో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.
ఐరాసలో చుక్కెదురు
అందులో భాగంగా ఐరాస భద్రతామండలిలో చర్చించాలని లేఖ రాయగా అందుకు చైనా మద్దతిచ్చింది. రహస్య సంప్రదింపులు జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ భేటీలో ఒక్క చైనా మినహా అన్నిదేశాలు భారత్ వాదనకే మద్దతిచ్చాయి.
ఫలితంగా మిగిలిన ఏకైక ప్రపంచ వేదిక అయిన అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పాకిస్థాన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.