మీడియాపై ఎన్నోసార్లు బహిరంగంగానే ఆగ్రహాన్ని ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే విధంగా ప్రవర్తించారు. అయితే.. ఈ సారి ట్రంప్ కోపానికి గురైంది పాకిస్థానీ విలేకరులు. కశ్మీర్ అంశంపై స్పందించాలని ట్రంప్‌పై పదే పదే ఒత్తిడి చేసిన నేపథ్యంలో... 'ఇలాంటి రిపోర్టర్లను ఎక్కడినుంచి పట్టుకొస్తారు' అని పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో చమత్కరించారు డొనాల్డ్.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా... ట్రంప్, ఇమ్రాన్లు సోమవారం సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, కశ్మీర్ సమస్య, అఫ్గాన్‌లో శాంతి అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో... జమ్ము ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో లోయలో నెలకొన్న పరిస్థితులపై పాక్ విలేకరులు ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
కశ్మీర్ పరిస్థితులపై అడిగిన ఓ పాకిస్థానీ విలేకరిని ట్రంప్ ఎగతాళి చేశారు. నువ్వేమైనా.. ఖాన్ బృందంలో సభ్యునివా..? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
''నువ్వు ఆయన (ఇమ్రాన్‌ఖాన్) బృందంలో సభ్యునివా..? నువ్వు అడిగినవి ప్రశ్నల్లా లేవు. నువ్వే స్వయంగా ప్రకటన చేస్తున్నట్టుంది.''
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ఆ తర్వాత కూడా.. పాక్ జర్నలిస్ట్ మరోసారి ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చారు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై ప్రశ్నించగా.. డొనాల్డ్ ఇమ్రాన్వైపు తిరిగి.. 'ఇలాంటి రిపోర్టర్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారు' అని అడిగారు.
నకిలీ వార్తలు సృష్టిస్తున్నారని ట్రంప్ గతంలోనూ పలుమార్లు మీడియాపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. సెప్టెంబర్ 2న మీడియాను ఉద్దేశిస్తూ ఫేక్ న్యూస్‌ను సృష్టించే సంస్థలు తన ప్రధాన శత్రువులని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:విదేశీ విద్యార్థులు మెచ్చిన రాష్ట్రం ఏదో తెలుసా..?